నేడే.. కౌంటింగ్‌ | - | Sakshi
Sakshi News home page

నేడే.. కౌంటింగ్‌

Oct 9 2026 1:26 AM | Updated on Oct 9 2026 1:26 AM

● గెలుపు గుర్రం ఎవరో... ● రాజకీయ పక్షాలలో ఉత్కంఠ ● ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం ● 11 గంటల కల్లా ఆధిక్యతపై స్పష్టత

న్యూస్‌రీల్‌

మధురాంతకం, ధారాపురం టీవీకే, డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులు

కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తి..

అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుండగా, ఉదయం 11 గంటల కల్లా తొలి ఆధిక్యతలు స్పష్టమయ్యే అవకాశం ఉంది. తిరుప్పూర్‌లోని ఎల్‌ఆర్‌జీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ను ఎన్నికల పరిశీలకులు, జిల్లా కలెక్టర్‌ మనీష్‌ నారాయణవర్‌ పరిశీలించారు. ధారాపురం నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్‌ ముగిసిన తర్వాత ఈవీఎంలను పటిష్ట భద్రత మధ్య ఇక్కడ సీల్‌ చేసి ఉంచారు. అలాగే మధురాంతకం ఈవీఎంలను అత్తూరులోని సామాజిక అభివృద్ధి సమీకృత శిక్షణా కేంద్రంలో భద్రపరిచారు. సీసీ టీవీల నిఘా నీడలో ఈవీఎంలలోని ఓట్లను లెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఇందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయా పార్టీల ఏజెంట్లకు కట్టుదిట్టమైన ఆంక్షలు విధించారు. అనుమతి పత్రాలు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్‌ కేంద్రాలలోకి అనుమతించే విధంగా భద్రతా పరంగా పకడ్భందీ చర్యలు తీసుకున్నారు. ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా ఓట్ల లెక్కింపును విజయవంతం చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ ఉప ఎన్నికలలో ఎవరు గెలిచినా స్వల్ప ఆధిక్యంతో గట్టెక్కాల్సిందే. ఇక, పుదుచ్చేరి తట్టాం చావడి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సైతం సర్వం సిద్ధంచేశారు.

సాక్షి, చైన్నె : తమిళనాడులో ప్రస్తుతం మధురాంతకం, ధారాపురం హైప్రొఫైల్‌ నియోజకవర్గాలుగా మారాయి. అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చి తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన వారు మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకునే దిశగా అధికారి టీవీకే అభ్యర్థులుగా ఇక్కడ రేసులో నిలబడ్డారు. ఈ నియోజకవర్గాలలో పంచ ముఖ సమరం అన్నది సాగినా మధురాంతకంలో టీవీకే అభ్యర్థి మరగదం కుమర వేల్‌, డీఎంకే అభ్యర్థి పరంథామన్‌, అన్నాడీఎంకే అభ్యర్థి కనిత సంపత్‌ మధ్య ప్రధాన సమరం నెలకొంది. ఇక ధారాపురంలో టీవీకే అభ్యర్థి సత్యభామ, అన్నాడీఎంకే అభ్యర్థి భానుమతి, డీఎంకే అభ్యర్థి సుకన్య మధ్య సమరం సాగింది. తమ సిట్టింగ్‌ సీటు మళ్లీ ఖాతాలో పడుతుందన్న ధీమాతో అన్నాడీఎంకే ఉంటే, టీవీకే చీఫ్‌, సీఎం విజయ్‌ చరిస్మాతో గెలుపు తథ్యమని ఆ పార్టీ అభ్యర్థులు ఆశాభావంతో ఉన్నారు. ఇక, ప్రభుత్వ వ్యతిరేకత తమకే సానుకూలం అన్నట్టుగా డీఎంకేలో ధీమా నెలకొని ఉంది. ఈ ఎన్నికల్లో టీవీకే గెలిస్తే, మరిన్ని ఉప ఎన్నికలు మున్ముందు రాక తప్పదన్న హెచ్చరికతో ఓట్ల సమరంలోకి డీఎంకే, అన్నాడీఎంకేలు వెళ్లాయి. దీంతో ఈ రెండు స్థానాల ఫలితాలపై ఎదురు చూపులు పెరిగాయి. విజయ్‌ చరిస్మాతో గెలుపు బావుటనే కాదు, భారీ ఆధిక్యంతో మళ్లీ గెలుస్తామన్న ధీమాను మరగదం కుమర వేల్‌, సత్యభామాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. అయితే, గెలుపు ఎవరిదో అన్నది మరికొన్ని గంటలలో తేలనున్నది.

వీడని టెన్షన్‌..

ఎవరి ధీమా వారికి ఉన్నప్పటికీ, ఓటింగ్‌ శాతం అన్నది టెన్షన్‌ రేపుతోంది. ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికలతో పోల్చితే తాజాగా ఐదు నుంచి పది శాతం వరకు ఓటింగ్‌ తగ్గడం కూడా ఇందుకు ఓ కారణంగా మారింది. మధురాంతకం నియోజకవర్గం 86.26% పోలింగ్‌ నమోదైంది. సాధారణ ఎన్నికలతో పోలిస్తే 6.96% తగ్గింది. ధారాపురం నియోజకవర్గం 80.25% పోలింగ్‌ నమోదకాగా, సాధారణ ఎన్నికలతో పోలిస్తే 9.65% తగ్గింది. ఇది సాధారణ ఎన్నిక కాకపోవడం, ఉప ఎన్నిక కావడంతో ఓటర్లలో కనిపించని ఉదాసీనత, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన ఓటర్లు సొంతూళ్లకు రాకుండా పోవడం, పోలింగ్‌ రోజున ఎండ తీవ్రత అధికంగా ఉండటం వంటివి ఓటింగ్‌ శాతం స్వల్పంగా తగ్గడానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, తమిళనాడు రాజకీయ చరిత్రలో సాధారణంగా ఉప ఎన్నికల సమయంలో పోలింగ్‌ శాతం 5 నుండి 10 శాతం వరకు పడిపోవడం సర్వసాధారణం. ఆ లెక్కన చూస్తే, ఈ రెండు నియోజకవర్గాల్లో నమోదైన ఓటింగ్‌ శాతాన్ని ఉప ఎన్నికల చరిత్రలోనే అత్యధిక టర్నోవర్‌గా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.

అధికార పక్షానికి అగ్ని పరీక్షగా మారిన ఉప ఎన్నికల సమరం ఫలితాలు మరికాసేపట్లో వెలువడనున్నాయి. అలాగే తాము మళ్లీ పుంజుకుంటుందన్న ధీమాను వ్యక్తం చేసే దిశగా ఫలితాల కోసం ప్రతి పక్షాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఈనేపథ్యంలో మధురాంతకం, దారాపురం ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటల కల్లా ఆధిక్యత అన్నది స్పష్టం కానున్నడంతో అభ్యర్థులలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement