త్వరలో మంత్రివర్గంలో మార్పులు? | - | Sakshi
Sakshi News home page

త్వరలో మంత్రివర్గంలో మార్పులు?

Oct 9 2026 1:26 AM | Updated on Oct 9 2026 1:26 AM

●పలువురికి ఉద్వాసన ●మరికొందరికి అవకాశం ●సంకీర్ణంలోకి పీఎంకేకు ఆహ్వానమా..?

సాక్షి, చైన్నె: ఉప ఎన్నికల ఫలితాల తదుపరి తమిళనాడు మంత్రివర్గంలో పెనుమార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని సచివాలయంలో చర్చ జోరందుకుంది. పీఎంకే అధికార పక్షం కూటమిలో చేరడం ఖాయం అన్న సంకేతాలు సైతం వెలువడ్డాయి. , ఆ పార్టీ తరఫున శాసనసభ పక్ష నేతగా ఉన్న సౌమ్య అన్బుమణిని కేబినెట్‌లోకి తీసుకోవాలని సీఎం విజయ్‌ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

కూటమిలో మారుతున్న సమీకరణాలు:

కాంగ్రెస్‌, వీసీకే, ఐయూఎంఎల్‌, సీపీఎం, సీపీఐ మద్దతుతో ప్రభుత్వాన్ని టీవీకే చీఫ్‌ విజయ్‌ ఏర్పా టు చేసిన విషయం తెలిసిందే.ఈ సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్‌, ఐయూఎంఎల్‌, వీసీకేలకు మంత్రి పదవులు సైతం కేటాయించారు. కూటమిలో ఉన్నప్పటికీ బయటి నుంచే తమ మద్దతు అని సీపీఎం,సీపీఐలు స్పష్టంచేస్తూవ స్తున్నాయి. ఉప ఎన్నికలలో సీపీఎం, సీపీఐలు టీవీకేకు మద్దతు ఇవ్వకుండా తమ అభ్యర్థులను పోటీలో పెట్టారు. అధికార టీవీకే తప్పులను ఖండిస్తూ పోరాటాలలో ఆ పార్టీలు ముందున్నాయి. అదే సమయంలో ఉప ఎన్నికల ప్రచారంలోనూ ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించాయి. ఇది కాస్త అధికార టీవీకేలో అసంతృప్తిని రగిల్చినట్లయ్యింది.

పీఎంకే ఎంట్రీకి రంగం సిద్ధం

సీపీఎం, సీపీఐలకు తలా రెండు ఎమ్మెల్యే ఉన్నప్పటీకి, వారి రూపంలో ప్రభుత్వం ఇరకాటంలో పడుతుండటంతో టీవీకే వర్గాలు పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. ఈ నాలుగు స్థానాలను పీఎంకే ద్వారా భర్తీ చేసుకునే వ్యూహంతో ఉన్నట్టు చర్చజరుగుతోంది. నలుగురు ఎమ్మెల్యేలున్న పీఎంకేను కూటమిలోకి ఆహ్వానించాలని సీఎం విజయ్‌ నిర్ణయించినట్టు టీవీకే వర్గాలు పేర్కొంటుండటం గమనార్హం. వీసీకే ఉన్న చోట, పీఎంకే, పీఎంకే ఉన్న చోట వీసీకే ఉండే పరిస్థితులు లేకున్నప్పటికీ, సీఎం విజయ్‌ ఈ రెండు పక్షాలను బుజ్జగించి, వారిని ఏక తాటిపైకి తన నేతృత్వంలోని కూటమితో పాటుగా, సంకీర్ణ ప్రభుత్వంలోనూ భాగస్వామ్యం చేసే దిశగా వ్యూహ రచనలో ఉన్నట్టు సమాచారం. ఈ కలయిక తమకు సులభతరమేనని టీవీకే ముఖ్య నేతలు భావిస్తుండటంతో విజయ్‌ సంకీర్ణ ప్రభుత్వంలోకి పీఎంకే చేరడం ఖాయం అన్న చర్చ ఊపందుకోవడం గమనార్హం.

కేబినెట్‌ ప్రక్షాళన :

ప్రస్తుత మంత్రులలో కొందరి పనితీరు ఆశించిన విధంగా లేకపోవడం, అలాగే మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఖాయమని సంకేతాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పీఎంకే కూటమిలో అధికారికంగా చేరితే, కీలక నేత సౌమ్య అన్బుమణికి మంత్రివర్గంలో బెర్త్‌ ఖాయమనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. అలాగే, మంత్రి ఆదవ్‌ అర్జునకు కీలక శాఖలు అప్పగించడం, మరి కొందరి శాఖలలో మార్పులు చేయడం, ఇంకొందర్ని సాగనంపి, మరి కొందరికి కొత్తగా అవకాశం కల్పించే విధంగా మంత్రివర్గం కూర్చు కసరత్తు జరుగుతున్నట్టు సచివాలయంలో చర్చ ఊపందుకోవడం ఆలోచించాల్సిందే. అదే సమయంలో డీఎంకేతో ఉన్నప్పుడు సంకీర్ణ ప్రభుత్వాన్ని ప్రశ్నించని కమ్యూనిస్టులు, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వాన్ని ప్రతి చిన్న విషయానికీ విమర్శించడం ఎంతవరకు సబబు? అని టీవీకే నేత ఒకరు ప్రశ్నించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement