సాక్షి, చైన్నె: తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన మేనమామ బంగారు ఉంగరాల పథకం మార్గదర్శకాలను సవరిస్తూ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి దారేష్ అహ్మద్ కీలక ఉత్తర్వులు జారీ చేవౠరు. అర్హులైన తల్లులకు మరింత సులభంగా లబ్ధి చేకూర్చేలా నిబంధనలను సడలిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తమిళనాడులో పుట్టి, ఇక్కడే వివాహం చేసుకుని ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న తల్లులకు కూడా ఈ పథకం వర్తింపజేయనున్నారు. తమిళనాడు ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించిన ఆ బిడ్డ తల్లి తల్లిదండ్రులు ఇద్దరూ తమిళనాడులో శాశ్వత నివాసితులై ఉండి, తగిన ధృవీకరణ పత్రాలను సమర్పిస్తే చాలు.. ఆ బాలింతకు ఈ పథకం కింద బంగారం అందజేస్తారు. ఈ సవరించిన నిబంధనలు గత జూన్ 22 నుంచి ప్రభుత్వ ఆసుపత్రులలో జన్మించిన పిల్లలందరికీ వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఈ సడలింపు నిబంధనల ప్రకారం.. కారైకుడి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ప్రసవించిన ఉమామహేశ్వరి అనే మహిళ సంతానానికి, మేనమామ బంగారు ఉంగరం ధృవీకరణ పత్రం కింద బుధవారం వైద్య అధికారి చేతుల మీదుగా ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని బహూకరించారు. కాగా, గత నెల 28న మదురై రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎం విజయ్ చేతుల మీదుగా ప్రారంభించబడిన ఈ పథకం, రాష్ట్రంలో శాశ్వతంగా నివసిస్తున్న తల్లులకు మాత్రమేనని తొలుత ప్రకటించగా.. తాజాగా నిబంధనలు సడలించడంతో సరిహద్దు రాష్ట్రాలు లేదా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన తమిళ తల్లులకు కూడా పెద్దపీట వేసినట్లయింది.
దూసుకెళ్తున్న
పవన విద్యుత్ రంగం
– కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
సాక్షి, చైన్నె: పవన విద్యుత్ రంగం సరికొత్త వృద్ది దశకు చేరుకుంటున్నట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. పునరుత్పాదక ఇంధన రంగంలో దూసుకెళ్తున్న భారత్.. పవన విద్యుత్ ఉత్పత్తిలో భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నట్టు ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి దేశంలో వార్షిక పవన విద్యుత్ స్థాపన 8 గిగావాట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని వివరించారు. చైన్నెలో విండేర్జీ ఇండియా 2026 అంతర్జాతీయ ప్రదర్శన ఏర్పాటైంది. ఇందులో 20 దేశాలకు పైగా సుమారు 400లకు పైగా గ్లోబల్ ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. 2030 నాటికి 107 గిగావాట్ల లక్ష్యంగా ఏర్పాటైన ఈ ప్రదర్శనను కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 6.05 గిగావాట్ల పవన విద్యుత్‌ను సాధించామని, 2027 నాటికి ఈ రికార్డును అధిగమించి 2030 నాటికి 100 గిగావాట్ల జాతీయ లక్ష్యాన్ని చేరుకుంటామనే నమ్మకం ఉందన్నారు. ఇండియన్ విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ చైర్మన్ గరీష్ తంతి మాట్లాడుతూ, భారత్ తన తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంటూ.. 2030 నాటికి ప్రపంచ విండ్ టర్బైన్ ఎగుమతుల్లో తన వాటాను ప్రస్తుత 2% నుంచి 10%కి పెంచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని వెల్లడించారు. ఈకార్యక్రమంలో తమిళనాడు విద్యుత్ శాఖమంత్రి నిర్మల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాహుల్ పర్యటనకు వేదికగా
చైన్నె ఐలాండ్ గ్రౌండ్స్
సాక్షి, చైన్నె: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ శనివారం చైన్నెకి రానున్నారు. చైన్నెలోని ఐల్యాండ్ గ్రౌండ్ వేదికగా జరిగే కార్యక్రమంలో విద్యార్థులతో ముచ్చటించనున్నారు. ఇందు కోసం ఏర్పాట్లు ముమ్మరంచేశారు. రాష్ట్రంలోని వివిధ కళాశాలల విద్యార్థులతో ప్రత్యక్షంగా ఆయన సంభాషించనున్నారు. విద్యార్థులు సులభంగా వచ్చి రాహుల్ గాంధీని కలిసేందుకు, ప్రసంగించేందుకు వీలుగా ఐలాండ్ గ్రౌండ్స్‌లో భారీ ప్రత్యేక వేదికతో పాటు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు.
విద్యార్థుల భాగస్వామ్యం
చైన్నెతో పాటు తమిళనాడులోని వివిధ జిల్లాల నుంచి సుమారు 120కి పైగా కళాశాలల నుంచి వేలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. జిల్లా వారీగా విద్యార్థులను సమన్వయం చేసేందుకు కాంగ్రెస్ విద్యార్థి సంఘాలు విస్తృతఏర్పాట్లు చేస్తున్నాయి. విద్యార్థులను ఉత్సాహపరిచేలా వేదికపై ప్రత్యేక సంగీత మరియు కళా ప్రదర్శనలను కూడా నిర్వహించనున్నారు. యువత , విద్యార్థుల సమస్యలు, విద్యారంగ సవాళ్లు, పోటీ పరీక్షల అంశాలపై రాహుల్ గాంధీ ఈ వేదిక ద్వారా నేరుగా ముచ్చటించనున్నారు.


