సాక్షి, చైన్నె: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 11న ఒక రోజు పర్యటన నిమిత్తం చైన్నెకి రానున్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గొననున్నారు. సీఎం గా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ప్రధాని మోదీతో కలిసి తొలి అధికారిక కార్యక్రమానికి హాజరు కానున్నారు. పీఎం మోదీ పర్యటన తాజాగా ఖారారు కావడంతో ఏర్పాట్లు వేగవంతమయ్యాయి.
పర్యటన షెడ్యూల్ ఇలా..
దమల్లి – వడపళని మధ్య నిర్మించిన 14.64 కి.మీ మెట్రో రైలు సర్వీసును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం పూందమల్లి నుంచి పోరూర్ వరకు ప్రధాని మోదీ, సీఎం విజయ్ మెట్రో రైలులో ప్రయాణించనున్నారు. పోరూర్ నుంచి ఐఐటి క్యాంపస్‌కు చేరుకోనున్న ప్రధాని.. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్‌ను సందర్శించనున్నారు. అలాగే ప్రముఖ స్టార్టప్ సంస్థల వ్యవస్థాపకులు, దివ్యాంగులైన పిల్లలతో ముచ్చటించనున్నారు. ఇదే వేదికపై సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీత అభ్యాస , పరిశోధనా కేంద్రం ప్రారంభం కానుంది.
రూ. 700 కోట్ల ప్రాజెక్టులు:
పలు జాతీయ రహదారి ప్రాజెక్టులతో పాటు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రాజెక్టులు, అమృత్ భారత్ కింద రూపుదిద్దుకున్న వివిధ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, కొత్త రైల్వే లైన్ తదితర రూ.700 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించనున్నారు. నందంబక్కం బిజినెస్ పార్క్‌లోని జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం స్వర్ణోత్సవాల్లో ప్రధాని పాల్గొని, ఏఐ ల్యాబ్‌ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభిస్తారు. చైన్నె కార్యక్రమాలు ముగిసిన తర్వాత సాయంత్రం హెలికాప్టర్ ద్వారా వేలూరుకు బయలుదేరి వెళ్లనున్న ప్రధాని మోదీ.. అక్కడ కొత్త మౌలిక సదుపాయాలతో పాటు వెల్లూరు విమానాశ్రయ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో రెండు భారీ రోడ్ షోలు
ప్రధాని పర్యటన సందర్భంగా తమిళనాడులో బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆయన పర్యటనలో భాగంగా రెండు చోట్ల ఘన స్వాగత రోడ్ షోలకు నిర్ణయించారు. విమానాశ్రయం నుంచి పరంగిమలై సైనిక స్టేడియం వరకు ప్రధాని కారు ప్రయాణించే మార్గంలో తొలి రోడ్ షో జరగనున్నది. పోరూర్ కార్యక్రమం ముగిసిన తర్వాత సైదాపేట కోర్టు సమీపం నుంచి అన్నా యూనివర్సిటీ మీదుగా ఐఐటి చైన్నె వరకు మరో రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి కుమార్, డీజీపీ మహేష్‌కుమార్ అగర్వాల్ నేతృత్వంలో ఉన్నత స్థాయి పోలీసు అధికారులు ఇప్పటికే భద్రతా ఏర్పాట్లపై సమీక్షించి నిర్ణయాలు తీసుకున్నారు.


