సాక్షి, చైన్నె: తమిళనాడులో పౌరుల సౌకర్యార్థం రిజిస్ట్రేషన్ల శాఖ సాంకేతిక విప్లవాన్ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు సేవలను డిజిటలైజ్ చేయగా.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 2 నుంచి కుటుంబ ఆస్తుల విభజన , ఉపవిభజన పత్రాలను కూడా కాగితరహితంగా నమోదు చేయనున్నట్లు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి లోకేష్ తమిళసెల్వన్ ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది.
మొదటి దశ విజయవంతం
సీఎం విజయ్ చేతుల మీదుగా గత ఆగస్టు 17న మొదటి భూమి హక్కు పత్రాలు, గృహ హక్కు పత్రాల డిజిటల్ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తర్వాత బ్యాంకులు, ఆర్థిక సంస్థల రుణాలు, మోడెర్న్ డీడ్స్ సమర్పణకు గైర్హాజరు నమోదు వ్యవస్థను తప్పనిసరి చేశారు. తాజా నిర్ణయం ప్రకారం.. ఆస్తుల ఏర్పాటు, విడుదల, విభజన, ఏర్పాటు ఉపసంహరణ వంటి నాలుగు రకాల కుటుంబ ఆస్తుల పంపిణీ పత్రాలను కాగితరహిత రిజిస్ట్రేషన్ విధానంలోకి తీసుకురానున్నారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా..
ఈ విధానంలో లబ్ధిదారులు తమ పత్రాలను ఆన్‌లైలో నేరుగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సంబంధిత సబ్–రిజిస్ట్రార్ కార్యాలయానికి ఒకసారి వెళ్లి తమ ఫొటో, వేలిముద్రలను నమోదు చేసుకుంటే సరిపోతుంది. ప్రక్రియ పూర్తయిన వెంటనే రిజిస్టర్ అయిన పత్రం నేరుగా ఆన్‌లైన్ ద్వారా డిజిటల్ రూపంలో అందుబాటులోకి వస్తుంది. కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా పత్రాల నమోదును మరింత సులభతరం చేసే ఈ సేవలు నవంబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.


