సాక్షి, చైన్నె: చైన్నె మహా నగరం మహామహా నగరంగా విస్తరించే దిశగా కార్యాచరణను వేగవంతం చేశారు. ఇప్పటివరకు 1,189 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న సీఎండీఏ సరిహద్దులను ఏకంగా 5,904 చదరపు కిలోమీటర్లకు విస్తరించేలా మూడో సమగ్ర ప్రణాళిక (మాస్టర్ ప్లాన్) రూపకల్పన పనులను అధికారులు వేగవంతం చేశారు. వివరాలు.. తమిళనాడు రాజధాని నగరం చైన్నెలో తొలి మాస్ట ర్ ప్లాన్ 1976లో అమలైంది. క్రమంగా నగరం పరిధి విస్తరించడంతో రెండవ మాస్టర్ ప్లాన్ 2008 లో అమల్లోకి వచ్చింది. దీని ఆధారంగా చైన్నె నగ రం 1189 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ప్రస్తు తం ఉంది. ఇది రానున్న కాలంలో నాలుగింతలు పెరగనుంది. రాబోయే 20 సంవత్సరాలలో చైన్నె మహానగర ప్రాంతం సాధించబోయే అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని గత డీఎంకే ప్రభుత్వం వేసిన సమగ్ర ప్రణాళిక బీజం తాజాగా కార్యరూపంలోకి రానున్నది. రవాణా సౌకర్యాల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, విపత్తు నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలు ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. చైన్నె మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(సీఎండీఏ) ఆధ్వర్యంలో ఈ మాస్టర్ ప్లాన్‌లో భూ వర్గీకరణ , కొత్త భవన నిర్మా ణ నిబంధనలతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా ప్రత్యేక మార్గదర్శకాలను చేర్చుతున్నారు.
కొత్త ప్రాంతాల చేరిక
ఈ విస్తరణలో భాగంగా చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలతో పాటు రాణిపేట జిల్లాలోని అరక్కోణం తాలూకా కూడా సీఎండీఏ పరిధిలోకి రానుంది. దీంతో అరక్కోణం కూడా చైన్నె మహా మహానగరంలో భాగం కానుంది. గత రెండవ సమగ్ర ప్రణాళిక గడువు త్వరలో ముగియనుండటంతో, ఈ మూడో మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నా రు. ఇందుకోసం సుమారు 40,000 మంది ప్రజల అభిప్రాయాలను సేకరించి, 26 అంశాలపై ముసాయిదా నివేదికను రూపొందించారు.
ప్రభుత్వ ఆమోదం:
సీఎండీఏ ప్రాంతాన్ని 5,904 చదరపు కిలోమీటర్లకు పెంచుతూ తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే 2024 లో ఆమోదం తెలిపింది.గృహ, పట్టణాభివృద్ధి శాఖ అధికారుల ఆదేశాల మేరకు, కొత్తగా చేరిన విస్తరణ ప్రాంతాలను కూడా సమన్వయం చేసుకుంటూ పూర్తి స్థాయి ప్రణాళికా పనులను చేపట్టనున్నారు. ఈ విస్తారిత ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయించి, ఆయా ప్రాంతాలపై పూర్తి నియంత్రణ ,అభివృద్ధి బాధ్యతలను తాజాగా సీఎండీఏ చేపట్టనుంది. ఈ మేరకు ఈ విస్తరణ పరిధిలోని నాలుగు కార్పొరేషన్లు (చైన్నె, ఆవడి, తాంబరం, కాంచీపురం), 12మునిసిపిపాలిటీలు, 1200 లకు పైగా గ్రామాలను చేర్చి ఉన్నారు. సీఎండీఏ తాజాగా తన కార్యాచరణను వేగవంతం చేసి ఈ మూడో మాస్టర్ ప్లాన్‌ను 2027 నుంచి అమల్లోకి తెచ్చేందుకు పరుగులు తీస్తోంది.


