మహిళలను కించపరిచే వారికి.. బుద్ధిచెప్పండి..! | - | Sakshi
Sakshi News home page

మహిళలను కించపరిచే వారికి.. బుద్ధిచెప్పండి..!

Oct 5 2026 12:21 AM | Updated on Oct 5 2026 12:21 AM

● ధారపురం ఎన్నికల ప్రచారంలో విజయ్‌ పిలుపు ● రోడ్‌ షోతో సుడిగాలి పర్యటన ● ముగిసిన ఉప ఎన్నికల ప్రచారం

న్యూస్‌రీల్‌

మహిళలను కించపరిచేలా, అవమానించేలా మాట్లాడే రాజకీయ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని, వారికి ఓటు వేయకూడదు, మద్దతూ ఇవ్వకూడదని టీవీకే ఽఅధ్యక్షుడు, సీఎం విజయ్‌ పిలుపు నిచ్చారు. తిరుప్పూర్‌ జిల్లాలోని ధారపురం నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన ఆదివారం ఆయన భారీ రోడ్‌ షో నిర్వహించారు.

సాక్షి, చైన్నె : చైన్నె నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం కోయంబత్తూరు చేరుకున్న సీఎం, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో ధారపురంలోని మారుతి నగర్‌ చేరుకున్నారు. హెలీప్యాడ్‌ వద్దకు వందలాది మంది కార్యకర్తలు తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు.

విజిల్‌ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి

అక్కడి నుంచి ప్రత్యేక ప్రచార వాహనంపై బయలుదేరిన విజయ్‌, టీవీకే అభ్యర్థి సత్యభామకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. విజిల్‌ గుర్తుపై ఓటు వేసి సత్యభామను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ధారపురం పట్టణ కేంద్రంలో గుమిగూడిన ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘ఇటీవలే మధురాంతకంలో నన్ను ప్రజలు ఆప్యాయంగా ఆదరించారు. ఆ ప్రేమే నేడు నన్ను ధారపురంలోని నా సొంత బంధువుల ముందుకు తీసుకువచ్చింది’’ అని అన్నారు. ఈ సందర్భంగా డీఎంకే తీరుపై విజయ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘డీఎంకే నాయకులు ఎంకే స్టాలిన్‌, ఆయన కుమారుడు ఉదయనిధి ఇటీవల ధారపురం ప్రచారంలో తమ అభ్యర్థి సత్యభామపై చేసిన వ్యాఖ్యలు అత్యంత అసభ్యకరంగా ఉన్నాయని మండిపడ్డారు. వినడానికి కూడా వీల్లేని విధంగా మాట్లాడారని, ఎంజీఆర్‌ కాలం నుంచి డీఎంకే ఇలాంటి దిగజారుడు రాజకీయాలే చేస్తున్నదన్నారు. తనపై వచ్చే విమర్శలను తాను భరిస్తాను, కానీ తన ఇంటి మహిళలను, సోదరీమణులను అవమానిస్తే మాత్రం మౌనంగా ఉండనని హెచ్చరించారు.

పోలీసులు – నామ్‌ తమిళర్‌ శ్రేణుల మధ్య వాగ్వాదం

రోడ్‌ షో సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒకే ప్రాంతంలో అధికార పార్టీ, నామ్‌ తమిళర్‌ కచ్చి శ్రేణులు ప్రచారంలో ముమ్మరంగా పాల్గొనడంతో పోలీసులు, నామ్‌ తమిళర్‌ కచ్చి కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ధారపురం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం విజయ్‌ మీనాక్షిపురం ప్రాంతంలో రోడ్‌ షో నిర్వహిస్తున్న సమయంలో, అదే ప్రాంతంలో నామ్‌ తమిళర్‌ కచ్చి అభ్యర్థి కార్తీక తన మద్దతుదారులతో కలిసి పార్టీ జెండాలు పట్టుకుని ప్రచారం చేస్తున్నారు. భద్రతా కారణ దృష్ట్యా సీఎం విజయ్‌ రోడ్‌ షో మార్గంలో ప్రచారం చేస్తున్న నామ్‌ తమిళర్‌ కచ్చి కార్యకర్తలను అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లాలని పోలీసులు కోరారు. పోలీసులు తొలగించేందుకు ప్రయత్నించడంతో నామ్‌ తమిళర్‌ కచ్చి శ్రేణులు వెనక్కి తగ్గకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అదే విధంగా వీరచిమంగళం ప్రాంతంలో సీఎం విజయ్‌ రోడ్‌ షో సాగుతున్న రహదారిని నామ్‌ తమిళర్‌ కచ్చి కార్యకర్తలు అడ్డుకోవడంతో ధారపురంలో కొంతసేపు కలకలం రేగింది.కట్టుదిట్టమైన భద్రత నడుమ సీఎం విజయ్‌ ఉప ఎన్నికల ప్రచారం సాయంత్రం వరకు 30 కి.మీ దూరం సాగింది. ప్రచారం ముగించుకుని ఆయన తిరిగి హెలికాప్టర్‌లో కోయంబత్తూరు మీదుగా చైన్నె చేరుకున్నారు.

ఉత్సాహంగా సాగిన రోడ్‌ షో

భారీ ఎండను సైతం లెక్కచేయకుండా వేలాది మంది ప్రజలు, అభిమానులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి విజయ్‌కు నీరాజనాలు పలికారు. ప్రచారంలో భాగంగా రేక్లా బండిపై పయనించారు. అమరావతి నది వంతెన సమీపంలో తన ప్రచార వాహనం దిగిన విజయ్‌, ఒక రైతుకు చెందిన రేక్లా బండి (ఎద్దుల బండి) ఎక్కి కొన్ని అడుగుల దూరం పయనించారు. మార్గమధ్యంలో మహిళలు ఇచ్చే హారతులను స్వీకరిస్తూ, వారి దిష్టి తీసేందుకు స్వయంగా స్పందించడంతో అభిమానులు ఉత్సాహపడ్డారు. మూలనూరు మార్గంలో నిలిపి ఉంచిన సాంప్రదాయ కాంగేయం ఎద్దుల వద్ద వాహనం నుంచి దిగి వాటితో ఫోటోలు దిగారు. ప్రజలు దారిపొడవునా విజయ్‌పై పూలవర్షం కురిపించారు. తీవ్రమైన ఎండలోనూ లక్షలాది మంది తరలిరావడంతో, ధారపురం ఉప ఎన్నికల ప్రచారపు చివరి ఘట్టం అత్యంత ఆసక్తికరంగా మారింది.

ముగిసిన ఉప ఎన్నికల ప్రచారం

ధారాపురం, మధురాంతకం, పుదుచ్చేరి తట్టాం చావడి ఉప ఎన్నికల ప్రచారం సాయంత్రంతో ముగిసింది. గత రెండు మూడు వారాలుగా నియోజకవర్గంలో ఓట్లవేట ఆగమేఘాలపై జరిగింది. డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే , వామపక్షాల అధినాయకులు ప్రచారంలో నిమగ్నమై తమ అభ్యర్థుల కోసం ఓట్ల వేటలో పడ్డారు. సాయంత్రంతో ప్రచారం ముగియడంతో నియోజకవర్గంలో భద్రతను ఎన్నికల యంత్రాంగం కట్టుదిట్టం చేసింది. నియోజకవర్గంతో సంబందం లేని వ్యక్తులను బయటకు పంపించే పనిలో పడ్డారు. సోమవారం ఉదయం నుంచి ఎన్నికల సామాగ్రిని ఆయా పోలింగ్‌ కేంద్రాలకు తరలించేందుకు సర్వం సిద్ధంచేశారు. నియో జకవర్గాలలో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. సమస్యాత్మక ప్రాంతాలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement