అధికార పార్టీ అహంకారానికి.. గుణపాఠం నేర్పాలి..! | - | Sakshi
Sakshi News home page

అధికార పార్టీ అహంకారానికి.. గుణపాఠం నేర్పాలి..!

Oct 5 2026 12:21 AM | Updated on Oct 5 2026 12:21 AM

● డీఎంకే అధ్యక్షుడు ఎం.కే. స్టాలిన్‌ పిలుపు

సాక్షి, చైన్నె : డీఎంకే, అన్నాడీఎంకేలో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయంటూ అబద్ధపు కథనాలతో ప్రజలను మోసం చేయాలని టీవీకే పాలకులు చూస్తున్నారని డీఎంకే అధ్యక్షుడు ఎం.కే. స్టాలిన్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమను రాజకీయంగా పెంచి పోషించిన పార్టీకే ద్రోహం చేసి అధికార పార్టీలో చేరిన అభ్యర్థుల చర్యల వల్లే ఈ ఉప ఎన్నికలు వచ్చాయని ఆయన మండిపడ్డారు. అధికార పార్టీ అహంకారానికి, ద్రోహానికి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు.ఈ మేరకు దారాపురం, మధురాంతకం అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎం.కే. స్టాలిన్‌ ఓటర్లను ఉద్దేశించి ఆదివారం సోషల్‌ మీడియా వేదికగా వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

ద్రోహానికి తగిన శాస్తి:

ఎన్నికలు ముగిసి కేవలం నాలుగు నెలలే అయినప్పటికీ, ప్రజలు నమ్మి గెలిపించిన ఎమ్మెల్యే అధికార పార్టీలో చేరి నియోజకవర్గానికి, ఓటర్ల గౌరవానికి ద్రోహం చేశారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉంటే పనులు జరగవనడం సరికాదని, అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమనే ఆలోచన ఉంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాల్సి వస్తుందని హితవు పలికారు. తమిళనాడు ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కాకుండా, మాఫియా ముఠాలతో రాష్ట్రాన్ని దోచుకోవడానికి పనిచేస్తున్నదని ఆరోపించారు. మహిళలకు వాగ్దానం చేసిన రూ. 2,500 సాయం గానీ, ఉచిత గ్యాస్‌ సిలిండర్ల హామీ గానీ నెరవేర్చలేదని విమర్శించారు. ధరల నియంత్రణను పట్టించుకోకుండా రూ. 1,200 కోట్లతో కొత్త సచివాలయ నిర్మాణం చేపట్టడం, నిరసనలు తెలుపుతున్న రైతులు, ఉద్యోగుల సమస్యలను వదిలేసి లండన్‌లో కార్‌ రేసింగ్‌ వీక్షించడానికి వెళ్లడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఉదయసూర్యుడి గుర్తుకు ఓటు వేయాలి

ప్రచారానికి వస్తున్న అధికార పార్టీ నాయకులను నిలదీసి తరిమికొట్టినట్లే, ఈ నెల 6న జరిగే పోలింగ్‌లో ఓటు ద్వారా వారిని ఓడించాలని కోరారు. ధారాపురం నియోజకవర్గ డీఎంకే అభ్యర్థి అడ్వకేట్‌ ఎస్‌. సుకన్య, మధురాంతకం అభ్యర్థి అడ్వకేట్‌ ఇ. పరంధామన్‌ను ఉదయసూర్యన్‌ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement