సాక్షి, చైన్నె: పరందూరులో రెండో విమానాశ్రయ నిర్మాణ ప్రణాళికను విరమించుకున్న తమిళనాడు ప్రభుత్వం, ప్రత్యామ్నాయంగా చైన్నె విమానాశ్రయాన్నే విస్తరించే దిశగా చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న విమానాశ్రయం పరిసరాలలో స్థల సేకరణ కసరత్తులు మొదలయ్యాయి. ఈ పరిధిలోని మూడు గ్రామాలపై దృష్టిని కేంద్రీకరించి స్థల సేకరణకు సన్నద్ధమయ్యారు. వివరాలు.. చైన్నె మీనాంబాక్కం విమానాశ్రయంలో పెరిగిన , భవిష్యత్తులో పెరగనున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని కాంచీపురం పరిధిలోని పరందూరులో సుమారు 3,700 ఎకరాల భూమిలో రెండో విమానాశ్రయ ప్రాజెక్టుకు గత డీఎంకే ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. అయితే, అధికారంలోకి వచ్చిన టీవీకే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రద్దు చేసింది. ఈ నిర్ణయంతో ఆ ప్రాజెక్టు నిమిత్తం నియమించిన డీఆర్వోలను ఇతర విధులకు బదిలీ చేశారు. సేకరించిన స్థలాన్ని మళ్లీరైతులకు ఇవ్వడమా..? లేదా పారిశ్రామిక వాడకు కేటాయించడమా? అన్న కసరత్తులు జరుగుతున్నాయి.
మరింతగా పెరుగుతున్న రద్దీ
చైన్నెలోని మీనంబాక్కం విమానాశ్రయంలో ప్రయాణికులు , సరుకు రవాణా (కార్గో) రాకపోకలు నిరంతరం పెరుగుతుండటంతో, భవిష్యత్ అవసరాల దృష్ట్యా విమానాశ్రయాన్ని ఆధునీకరించి విస్తరించడం అనివార్యమైంది. కార్గో పరిసరాలలో అయితే, వాహనాలు కిలో మీటర్ల కొద్ది బారులు తీరుతుండటంతో జీఎస్టీ రోడ్డు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కి ఉంది. దీంతో త్వరితగతిన విస్తరణ పనులు చేపట్టాల్సిన పరిస్థితి టీవీకే ప్రభుత్వానికి నెలకొంది.
కొత్త గ్రామాల్లో భూసేకరణ..
విమానాశ్రయ విస్తరణ పనుల్లో భాగంగా ప్రధానంగా మనపాక్కం, కొలప్పాక్కం, కౌల్‌బజార్ పరిసర ప్రాంతాలైన కెరుగంపాక్కం, తరపాక్కం గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియను ముమ్మరం చేశారు. భూసేకరణ పనుల పర్యవేక్షణ కోసం అలందూర్ తాలూకా కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. గతంలో ప్రతిపాదించిన కొన్ని భూములను పౌర విమానయాన శాఖ నియోగించు కోకపోవడంతో కొంత భూమిని విడుదల చేసినప్పటికీ.. ప్రస్తుత అవసరాల కోసం మనపాక్కం, కొలప్పాక్కం, కౌల్‌బజార్ గ్రామాల్లో భూసేకరణకు సంబంధించిన తదుపరి అధికారిక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ స్థల సేకరణ డిసెంబరులోపు ముగించి జనవరి నుంచి విస్తరణ పనులకు శ్రీకారంచుట్టేదిశగా ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించేందుకు సీఎం విజయ్ ఆదేశాలు జారీచేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి.


