– ఎడప్పాడి పళనిస్వామి పిలుపు
సాక్షి, చైన్నె: మధురాంతకం, దారాపురం అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళ నిస్వామి ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. పార్టీని వీడి, తమిళగ వెట్రి కలగం తరఫున మళ్లీ పోటీ చేస్తున్న ద్రోహులను ఈ ఉపఎన్నికల్లో ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన ఓటర్లను కోరారు. మధురాంతకం, తారాపురం నియోజకవర్గాల ఓటర్లను ఉద్దేశించి ఆయన సందేశాన్ని విడుదల చేశారు.
రాజకీయ భేరసారాలు
శాసనసభ ఎన్నికల్లోఅన్నాడీఎంకే తరఫున గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు, పదవీ ఆశతో తమ పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరారని పళనిస్వా మి విమర్శించారు. ఓటు వేసిన వేలిపై సిరా ఆరకముందే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో తగినంత మెజారిటీ లేకపోయినా, ఇతర పార్టీల మద్దతుతో టీవీకే మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతోందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు సంక్షేమం అందించడం మానేసి, రోజుకో రీల్, సినిమా సీన్లను ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ప్రజా వ్యతిరేకత స్పష్టం
పార్టీతో పాటు ఎంజీఆర్, జయలలిత ఆశయాలకు, ఓటేసిన ప్రజలకు ద్రోహం చేసిన అభ్యర్థులకు నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోందని పేర్కొన్నారు. ఓటమి భయంతోనే టీవీకే అక్రమ మార్గాల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి యత్నిస్తోందని ఆరోపించారు. ద్రోహానికి, అధికార దుర్వినియోగానికి ముగింపు పలకాలంటే అన్నాడీఎంకే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మధురాంతకం అభ్యర్థి కనిత సంపత్, దారాపురం అభ్యర్థి భానుమతిలకు రెండాకుల గుర్తుపై ఓటు వేసి, టీవీకే , డిఎంకే అభ్యర్థులను ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇకపై ఏ నాయకుడూ ప్రజలకు, పార్టీకి ద్రోహం చేసే ధైర్యం చేయకూడదని, ఈ ఉపఎన్నికల్లో ఓటర్లు ఇచ్చే తీర్పు ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలవాలని పళనిస్వామి పిలుపునిచ్చారు.


