నేడు మీనాక్షి అమ్మవారి ఆలయ మహా కుంభాభిషేకం | - | Sakshi
Sakshi News home page

నేడు మీనాక్షి అమ్మవారి ఆలయ మహా కుంభాభిషేకం

Sep 17 2026 1:20 AM | Updated on Sep 17 2026 1:20 AM

● 6,500 మంది పోలీసులతో భారీ భద్రత ● వేడుకగా పరివార దేవతల సన్నిధులలో ప్రతిష్టాపన పూజలు ● రాజకీయ దుమారానికి కారణమైన పాస్‌లు

సాక్షి, చైన్నె : గత డీఎంకే హయంలో పురాతన, ప్రసిద్ధి చెందిన ఆలయాలకు కుంభాభిషేక నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇందులో భాగంగా 2018లో అగ్నిప్రమాదంలో దెబ్బతిన్న మదురైలోని చారిత్రక వీరవసంతరాయర్‌ మంటపాన్ని రూ. 35 కోట్ల వ్యయంతో పునరుద్ధరించారు. మూసివేసిన తూర్పు గోపుర ద్వారాన్ని కూడా భక్తుల దర్శనార్థం ఆధునీకరించి తెరిచారు. ఆలయ నిధులు, దాతల విరాళాల భాగస్వామ్యంతో రూ. 28 కోట్ల అంచనాతో సమగ్ర పునర్నిర్మాణ పనులను పూర్తి చేశారు. త్జాగా మహా కుంభాభిషేక వేడుకల మదురై మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని ముస్తాబు చేశారు.

యాగశాల పూజలు..

మదురై ఉత్తర ఆడి వీధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక యాగశాలలో 184 గుండాలను సిద్ధం చేశారు. వీటిలో మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వర స్వామివారికి తలా 33, పంచాగ్ని గుండాలు 70, ఏకాగ్ని గుండాలు 42 , రిగ్‌ కుంభాలు ఉన్నాయి. ఈనెల 11వ తేదీ నుంచి సుమారు 350 మంది శివాచార్యులు ఈ వేద క్రతువుల్లో పాల్గొంటువస్తున్నారు.మూలవర్ల సన్యాస బంధన క్రతువుల కారణంగా గర్భగుడి దర్శనాలను నిలిపివేశారు. భక్తులను యాగశాల పూజలు వీక్షించేందుకు అనుమతించారు.బుధవారం పరివార దేవతల ప్రతిష్టాపన పూజలు అత్యంత వేడుకగా పూర్తి చేశారు. ఇక, గురువారం ఉదయం 4 గంటలకు 12వ కాల యాగ పూజ, ఉదయం 7:40లకు యాగశాల నుండి కలశాల ఊరేగింపు అనంతరం మీనాక్షి, సుందరేశ్వరర్‌ ఆలయాల బంగారు విమానాలు, రాజగోపుర కలశాలకు ఏకకాలంలో మహా కుంభాభిషేకం నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. ఉదయం 7.55 గంటలకు మూలవర్‌ మీనాక్షి అమ్మవారికి కుంభాభిషేకం, ఉదయం 8.10గంటలకు మూలవర్‌ సుందరేశ్వర స్వామివారికి కుంభాభిషేకం జరగనున్నాయి. సాయంత్రం మూలవిరాట్లకు మహా అభిషేకం, పంచమూర్తుల రథోత్సవం, వీధి ఉత్సవం జరగనుంది. ఈ వేడుకలో దేవాదాయ శాఖ మంత్రి రమేష్‌, న్యాయశాఖ మంత్రి నిర్మల్‌కుమార్‌, ఉన్నత విద్యాశాఖ మంత్రి పి.విశ్వనాథన్‌ తదితరులు పాల్గొంటున్నారు. భక్తుల సౌకర్యార్థం పుదుమండపంలో అన్ని శాఖలను సమన్వయం చేసేలా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. సుమారు లక్షల మంది భక్తులకు అన్నదానం , ప్రసాదాల పంపిణీ దిశగా కొన్ని సంస్థలకు మాత్రమే అనుమతులు కేటాయించారు. ఆలయ ప్రాంగణం, చుట్టుపక్కల వీధుల్లో వైద్య శిబిరాలు, 108 అంబులెన్స్‌ సేవలు అందుబాటులో ఉంచారు. వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు నగరవ్యాప్తంగా పలు కీలక కూడళ్లలో ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసినట్లు మంత్రి రమేష్‌ వెల్లడించారు.తమిళ ఓదువార్లు (శివ భక్తులు/స్తోత్ర పఠనకర్తలు) యాగ పూజలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. తమిళ భాషకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని, కలశంపై పుణ్యతీర్థాలు చల్లేందుకు, గర్భగుడిలోకి వెళ్లేందుకు తమిళ ఓదువార్లకు పూర్తి అనుమతి ఉందని స్పష్టం చేశారు. కాగా, మదురై వైపుగా పలు నగరాల నుంచి బస్సులు, చైన్నె నుంచి రైళ్లు సైతం నడిపారు.

పాస్‌ల జారీ వివాదం

సుమారు 17 సంవత్సరాల తర్వాత మదురై మీనాక్షి సుందరేశ్వరర్‌ ఆలయ మహా కుంభాభిషేకం జరగనున్నది. ఇందులో 4 వేల మంది దాతలు, విఐపీలు, రాజకీయ నాయకులు, దేవాదాయ , పోలీసు శాఖల ఉన్నతాధికారుల కుటుంబాలతో సహా మొత్తం 11,000 మందికి మాత్రమే ఆలయంలోకి అనుమతినిచ్చేలా 8 రకాల ప్రత్యేక పాస్‌లు సిద్ధం చేశారు. అయితే, ఆలయ పునర్నిర్మాణ పనులకు లక్షలాది, కోట్ల రూపాయల విరాళాలు అందించిన దాతలకు ఇప్పటివరకు పాస్‌లు అందకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రస్ట్‌ బోర్డు ఛైర్మన్‌ రుక్మిణి పళనివేల్‌ రాజన్‌ , ఇతర ట్రస్టీలు కలిగిన ఆలయ నిర్వహణ కమిటీని పక్కనపెట్టి, టీవీకే ప్రభుత్వానికి చెందిన మంత్రి నిర్మల్‌ కుమార్‌ ఆలయ నిర్వహణను తమ గుప్పిట్లోకి తీసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా యంత్రాంగం, మంత్రి నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశాల్లోనూ, పాస్‌ల పంపిణీలోనూ ట్రస్టీలను, రూ. కోట్లు విరాళాలు ఇచ్చిన దాతలను తీవ్రంగా ఉపేక్షించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత డీఎంకే పాలనలో ఆలయ నిధులు, దాతల నిధుల నుండి రూ. 28 కోట్లతో కుంభాభిషేక పనులు, రూ. 35 కోట్లతో వీరవసంతరాయర్‌ మంటపం పునరుద్ధరణ పనులు జరిగిన విషయం తెలిసిందే.

జర్నలిస్టులకు, కార్పొరేటర్లకు అనుమతి నిరాకరణ

కుంభాభిషేక కవరేజ్‌ కోసం జర్నలిస్టులకు ప్రత్యక్ష ప్రవేశం నిరాకరించారు. వారి కోసం పుదుమండపంలో ఆన్‌లైన్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ సదుపాయంతో ప్రత్యేక మీడియా రూమ్‌ మాత్రమే ఏర్పాటు చేశారు. ఇక, మదురై కార్పొరేషన్‌ నిధులతో ఆలయ పరిసరాల్లో మౌలిక వసతుల పనులు చేపట్టినప్పటికీ, మొత్తం 100 మంది వార్డు కౌన్సిలర్లలో ఒక్కరికి కూడా వేడుకలో పాల్గొనేందుకు పాస్‌లు కేటాయించలేదు. అయితే, మదురై మీనాక్షి ఆలయ కుంభాభిషేకంలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదు మంత్రి నిర్మల్‌ కుమార్‌ వివరణ ఇచ్చారు. పాస్‌ల కేటాయింపులో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోలేదని, వాటిని తాము కనీసం చూడలేదని మంత్రి స్పష్టం చేశారు. భద్రత , ప్రజల ప్రాణరక్షణను దృష్టిలో ఉంచుకునే పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆలయ పైభాగానికి తొలుత 9 వేల మందిని అనుమతించాలని భావించినప్పటికీ, భవన ప్రాంగణ స్థిరత్వం ఆధారంగానే చివరి క్షణంలో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. సాధారణ ప్రజలకు డిజిటల్‌, లక్కీ డ్రా విధానం ద్వారా 2 వేల పాస్‌లు కేటాయించామని, చిత్తిర వీధి కేవలం టవర్‌ వద్దకు వెళ్లే ప్రవేశ మార్గమని, అక్కడ నిలబడి దర్శనం చేసుకునేందుకు అనుమతి లేదని వివరించారు. ఆలయ ట్రస్టీల బోర్డుతో మాట్లాడి వారికి కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement