– విజయ్ బహిరంగ కార్యక్రమం రద్దు
సాక్షి, చైన్నె : తమిళనాడుకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు అధికారిక పర్యటనలో భాగంగా లండన్ వెళ్లిన సీఎం విజయ్‌ను చూడటానికి ప్రవాస తమిళులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. అయితే భారీ రద్దీ, భద్రతా కారణాల దృష్ట్యా ఆయన హాజరుకావాల్సిన బహిరంగ కార్యక్రమాన్ని లండన్ పోలీసులు అకస్మాత్తుగా రద్దు చేశారు. ఈనెల 10న లండన్ చేరుకున్న విజయ్, తయారీ , సాంకేతిక రంగాలలో పెట్టుబడులను ఆకర్షించడానికి వివిధ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. రూ. 15 వేల కోట్ల మేరకు పెట్టుబడి ఒప్పందాలు ఈసందర్భంగా జరిగాయి. ఈ పర్యటనలోనే సిల్వర్‌స్టోన్ రేసింగ్ ట్రాక్‌లో జరిగిన మిషెలిన్ లే మాన్స్ కప్ రేసులో పాల్గొన్న తమిళ నటుడు, రేసర్ అజిత్ కుమార్‌ను విజయ్ కలిశారు.
జనసందోహంతో భద్రతా సమస్యలు: విజయ్ బస చేసిన లండన్‌లోని అత్యంత ఎత్తైన భవనం ’ది షార్డ్’ ద్దకు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ ప్రాంతం లండన్ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్ , ఒక ప్రధాన ఆసుపత్రికి సమీపంలో ఉండటంతో అత్యవసర సేవలకు, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఊహించని రీతిలో వేలాది మంది గుమిగూడటంతో ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని, తగిన పోలీసు అనుమతులు లేకపోవడంతో విజయ్ బృందం, లండన్ పోలీసులు ఆ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కొందరు అయితే, విజయ్ ఫొటోలు, టీవీకే జెండాలతో సందడి చేశారు. గంటల తరబడి వేచి చూసిన అభిమానులు విజయ్‌ను చూడలేక నిరాశతో వెనుతిరిగారు. అయితే అక్కడి భద్రత, ఆసుపత్రి అత్యవసర పరిస్థితులను బట్టి పోలీసులు తీసుకున్న నిర్ణయం సరైనదేనని కొందరు అభిప్రాయపడ్డారు. ఈ పర్యటన ముగించుకుని సీఎం విజయ్ తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన గురువారం చైన్నెకు రానున్నారు.


