సాక్షి, చైన్నె: తిరువణ్ణామలై నియోజకవర్గ డీఎంకే ఎమ్మెల్యే, విప్, మాజీ మంత్రి ఏవీ వేలు ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో తిరువణ్ణామలై నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఏవీ వేలు 2,455 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే, ఆయన విజయాన్ని సవాలు చేస్తూ టీవీకే అభ్యర్థి అరుళ్ ఆరుముగం హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వేలు తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ టి. భరతచక్రవర్తి.. ఎన్నికల పిటిషన్‌ను విచారించడానికి తగినంత కారణాలు లేవని స్పష్టం చేస్తూ టీవీకే అభ్యర్థి అరుళ్ ఆరుముగం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇప్పటికే టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజా, పెరుందురై నియోజకవర్గం నుండి ఎంపికై రాజీనామా చేసిన జయకుమార్, గోపిశెట్టిపాళయం ఎమ్మెల్యే సెంగోట్టయ్యన్, కోయంబత్తూర్ సౌత్ డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీలకు వ్యతిరేకంగా దాఖలైన ఎన్నికల పిటిషన్లను కూడా మద్రాస్ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.
స్టాలిన్‌కు విశ్రాంతి
సాక్షి, చైన్నె : డీఎంకే అద్యక్షుడు ఎంకే స్టాలిన్ జ్వరం బారిన పడ్డ విషయం తెలిసిందే. ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆయన వైరల్ ఫీవర్‌గా గుర్తించారు. దీంతో ఆయనకు 3 రోజులు పూర్తి విశ్రాంతికి చర్యలు తీసుకున్నారు. ఈ దృష్ట్యా, స్టాలిన్ తన నివాసానికే పరిమితం కానున్నారు. కాగా ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, ఎవ్వరూ ఆయన్ను పరామర్శించేందుకు రావద్దు అని పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.
చైన్నె శివారులో దారుణం
– ఉత్తరాది యువకుడ్ని కొట్టి చంపి, ఉరి తీశారు..
సాక్షి, చైన్నె: చైన్నె శివారులోని కాంచీపురం జిల్లా ఒరగడం పారిశ్రామిక వాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరాది యుకుడ్ని కొట్టి చంపి ఆపై ఉరి తీసి ఉండటం బుధవారం వెలుగులోకి వచ్చింది. ఇక్కడి వడక్కుప్పట్టు పంచాయతీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో ఉత్తరాదికి చెందిన ఒక యువకుడు దారుణంగా ఉరి వేసుకున్న స్థితిలో వేలాడుతున్నట్టు పోలీసులకు ఉదయం సమాచారం అందింది. ఆ ఇంట్లోకి వెళ్లగా, పూర్తిగా రక్తం కారి ఉండటం, ఆయువకుడి మెడ, తల, శరీరంపై తీవ్ర గాయాలు ఉండటంతో దీనిని హత్యగా నిర్ధారించారు. ఇతడిని కొట్టి చంపి, ఆతర్వాత ఉరి తీసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో హతుడితో పాటూ అదే గదిలో ఐదుగురు ఉత్తరాది వాసులు ఉన్నట్టు గుర్తించారు. అయితే, వారి వివరాలు తెలియక పోవడంతో పనిచేస్తున్న ఫ్యాక్టరీలో విచారిస్తున్నారు. హతుడు, నిందితుల వివరాల సేకరణతో కేసు దర్యాప్తునుపోలీసులు వేగవంతం చేశారు. ఆ ఐదుగురు ఏమయ్యారో అన్నది తెలియ రాకపోవడంతో ఏదేని గొడవలో వారే ఇతడ్ని కొట్టి చంపి ఉరి తీసిన పరిస్థితిలో వేలాడ దీసి పరారై ఉండ వచ్చు అని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి, పూర్తి వివరాలతో పాటు పరారీలో ఉన్న నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
దక్షిణ రైల్వేలో స్వచ్ఛత హి సేవా ప్రచారం
సాక్షి, చైన్నె: దక్షిణ రైల్వే హెడ్‌క్వార్టర్స్‌లోని జనరల్ మేనేజర్ కార్యాలయంలో స్వచ్ఛత హి సేవా – 2026 ప్రచార కర్టెన్ రైజర్ కార్యక్రమం బుధవారం జరిగింది. దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ యు. సుబ్బారావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, అడిషనల్ జనరల్ మేనేజర్ విపిన్ కుమార్, వివిధ విభాగాల అధిపతులు, డీఆర్‌ఎంలు హాజరయ్యారు. స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్‌లక్ష్యంగా పరిశుభ్రతను మెరుగుపరచడం, ప్రత్యేక శ్రమదానం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 1, ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాత్ (ఒక రోజు, ఒక గంట, కలసికట్టుగా) కార్యక్రమంలో భాగంగా రైల్వే సిబ్బంది , ప్రయాణికులు 1 గంట పాటు శ్రమదానం చేయనున్నారు. అక్టోబరు 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛభారత్ దివస్‌తో ఈ ప్రచారం ముగుస్తుందని దక్షిణ రైల్వే జీఎం సుబ్బారావు తెలిపారు. దక్షిణ రైల్వే వ్యాప్తంగా ఉన్న డివిజన్లు, స్టేషన్లు, కాలనీల్లో ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు.


