అన్బిల్‌ మహేష్‌ వంతు | - | Sakshi
Sakshi News home page

అన్బిల్‌ మహేష్‌ వంతు

Sep 17 2026 1:20 AM | Updated on Sep 17 2026 1:20 AM

● చైన్నె, తిరుచ్చిలో సీసీబీ సోదాలు ● డీఎంకే వ్యతిరేకత– నిరసన

టార్గెట్‌ మరో మాజీ మంత్రి

సాక్షి, చైన్నె: రాష్ట్రంలో డీఎంకే మాజీ మంత్రులను టార్గెట్‌ చేసిన టీవీకే పాలకులు తాజాగా మరో మాజీ మంత్రి అన్బిల్‌ మహేశ్‌ను గురి పెట్టారు. తిరుచ్చి తిరువెరంబూరులోని ఆయన నివాసంలో చైన్నె సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ (సీసీబీ) పోలీసులు బుధవారం సోదాలు నిర్వహిస్తున్నారు. తిరుచ్చిలోని ఆయన ఇంట్లో ఉదయం 7 గంటల నుంచే కొన్ని గంటల పాటుగా తనిఖీలు నిర్వహించారు. టీవీకే అధికారంలోకి వచ్చినానంతరం డీఎంకే మాజీ మంత్రులను టార్గెట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే మాజీ మంత్రులు ఏవీ వేలు, సెంథిల్‌ బాలాజీ, కేఎన్‌నెహ్రు తదితరులను టార్గెట్‌ చేయగా, ప్రస్తుతం అన్బిల్‌ మహేశ్‌పై కన్ను పడింది.

సోదాలకు అసలు కారణం

గత డీఎంకే పాలనా కాలంలో ప్రైవేట్‌ పాఠశాలలకు గుర్తింపు, అనుమతులు మంజూరు పేరుతో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు ఇటీవల వచ్చాయి. తమిళనాడు ప్రైవేట్‌ పాఠశాలల సంఘం పేరిట చైన్నె శాలి గ్రామంలో బి.టి. అరసకుమార్‌ నడుపుతూ, ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాల నుంచి సుమారు 100 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో సీసీబీ రంగంలోకి దిగంది. ఈ కేసులో ఇప్పటికే అతడ్ని అరెస్టు చేశారు. ఈ భారీ ఆర్థిక మోసంలో నాటి విద్యాశాఖ మంత్రిగా ఉన్న అన్బిల్‌ మహేష్‌కు కూడా ప్రమేయం ఉందన్న కోణంలో పోలీసులు తాజాగా దర్యాప్తును తీవ్రతరం చేశారు.

సోదాలు..సమన్లు..

ఈ దర్యాప్తులో భాగంగానే చైన్నె, తిరుచ్చి సహా పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. మాజీ మంత్రి నివాసంలో సోదాలు జరుగుతున్న విషయం తెలుసుకున్న డీఎంకే కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఇంటి ముందు బైఠాయించారు. తిరువెరంబూరులోని నివాసంలో అన్బిల్‌ మహేశ్‌ ఉన్న సమయంలోనే సీసీబీ వర్గాలు అక్కడికి చేరుకున్నారు. వారికి ఆయన సంపూర్ణంగా సహకరించారు. ఆయన ఇంట్లో కొన్ని గంటల పాటుగా జరిగిన సోదాలలో కొన్ని రికార్డులను సీజ్‌చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి.అలాగే, 18వ తేదీన విచారణకు రావాలని అన్బిల్‌ మహేశ్‌కు సీసీబీ వర్గాలు సమన్‌ అందజేసింది. ఈ సందర్భంగా అన్బిల్‌ మహేశ్‌ మాట్లాడుతూ, తాను ఏ తప్పు చేయలేదని, చట్టపరంగా ఎదుర్కొంటానన్నారు. ఏదో ఊహజనిత సమాచారం మేరకు ఉప ఎన్నికల వేళ ఈ సోదాలు జరిగినట్టుందని అనుమానం వ్యక్తంచేశారు. ధారాపురంలో తన ఎన్నికల పనులను అడ్డుకునే వ్యూహంతో పాలక వర్గం ఉందని విమర్శించారు. కాగా, ఈ సోదాలకు కొద్ది సేపటికి ముందుగా చైన్నె పోలీసులు ఈ కేసుకు సంబంధించిన వివరాల ప్రకటనను విడుదల చేయడం గమనార్హం. ఈ సోదాలను వ్యతిరేకిస్తూ పలు చోట్ల డీఎంకే వర్గాలు ఆందోలనకు దిగాయి.

డీఎంకే ఫైర్‌

ఈ సోదాల సమాచారం అందుకున్న డీఎంకే శాసన సభా పక్ష ఉపనేత, పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కే.ఎన్‌. నెహ్రూ వెంటనే అక్కడికి చేరుకున్నప్పటికీ, పోలీసులు ఆయనను లోపలికి అనుమతించలేదు. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన కే.ఎన్‌. నెహ్రూ తీవ్రంగా మండిపడ్డారు: డీఎంకే హయాంలో సమర్థవంతంగా పనిచేసిన మంత్రులందరినీ ఇలాంటి దాడులతో వేధించడం కక్షసాధింపు చర్యేగా పేర్కొన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ రాజకీయ కక్ష అని మండి పడ్డారు. సోదాలు ముగిసిన తర్వాత అన్బిల్‌ మహేష్‌ తనకు ఫోన్‌ చేసి మాట్లాడారని, చట్టపరంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి, తాము ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకుని బయటికి వస్తామని ఆయన ధైర్యంగా చెప్పారని స్పష్టం చేశారు. ఇక, మాజీ మంత్రి అన్బిల్‌ మహేష్‌ నివాసంలో సోదాలు ’టీవీకే ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ మండి పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ కోతలు, పట్టినంబాక్కంలో మత్స్యకారుల ఆందోళనలు, సచివాలయం ముందు నేపాల్‌లో అదృశ్యమైన వారి బంధువుల నిరసనలు, ఆవిన్‌ పాల కొరత, చైన్నెలో వినాయక చవితి ఊరేగింపులో ప్రభుత్వ బస్సు డ్రైవర్‌ హత్య వంటి వరుస ఘటనలతో రాష్ట్రం తీవ్ర అశాంతిలో ఉందన్నారు. ఈ తీవ్రమైన సమస్యలను పరిష్కరించకుండా, ముఖ్యమంత్రి విజయ్‌ లండన్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్నారని ఆరోపించారు. పాలనా వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే మాజీ మంత్రి అన్బిల్‌ మహేష్‌ ఇళ్లపై ఈ సోదాలు అని మండి పడ్డారు. కాగా, ఎంపీ జగద్రక్షకన్‌ స్పందిస్తూ తమిళనాడులో మాజీమంత్రులపై సోదాలు పరిపాటిగామారిందని, చివరకు పాలక పక్షానికి భంగపాటుతప్పదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement