రాజంపేట: కడప–రేణిగుంట జాతీయ రహదారిపై రాజంపేట మండలం భువనగిరిపల్లె ఆర్చ్ వద్ద ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడులోని మధురై నుంచి ఎర్రగుంట్ల వైపు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్, గుజరాత్ నుంచి తిరుపతి వైపు వెళ్తున్న ఐరన్ లోడు లారీ ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సిమెంట్ ట్యాంకర్ డ్రైవర్, తమిళనాడు మధురైకు చెందిన కన్నన్ (45) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద తీవ్రతకు అతడి మృతదేహం డ్రైవర్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది క్రేన్ సహాయంతో తీవ్రంగా శ్రమించి మృతదేహాన్ని బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రెండు భారీ వాహనాలు ఢీకొనడంతో హైవేపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడగా, పోలీసులు రంగంలోకి దిగి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
కొరుక్కుపేట: లయన్స్ క్లబ్ ద్వారా విజయేంద్ర రావు సమాజానికి ఎనలేని సేవలు అందించారని లలిత జ్యువెల్లర్స్ అధినేత కిరణ్ కుమార్ ప్రశంసించారు. చైన్నె టి.నగర్ లోని గెలాక్సీ ఫుడ్ స్వ్కయర్ వేదికగా పీఎంజీఏఎఫ్ లయన్ విజయేంద్ర రావు తన 75వ పుట్టిన రోజును సతీ సమేతంగా బంధువులు, స్నేహితుల మధ్య, కూతుళ్లు, అల్లుళ్లు. మనవరాలు, మనవళ్ల మధ్య చాలా సందడి గా ఆదివారం జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నేపథ్య గాయకుడు డాక్టర్ మనో పాల్గొని తన గానంతో ఆశీర్వదించారు. అలాగే లలితా జ్యూవెల్లర్స్ అధినేత కిరణ్ కుమార్, ప్రముఖ ఆర్కిటెక్ ఆదిశేషయ్య, మార్గదర్శి శ్రీనివాస్, డాక్టర్ ఏవీ శివకుమారి, కళాసుధ శ్రీనివాస్, లయన్ సురేష్, లయన్ విఘ్నేష్,ప్రముఖ వాలీబాల్ ప్లేయర్స్, ఆంధ్రప్రదేశ్ నుంచి పలువురు ప్రముఖులు, అన్నానగర్ లయన్ క్లబ్ ప్రతినిధులు, గవర్నర్లు, ఆయన్ మాణిక్యం. లయన్ రాజేష్ జోషి, సీటీఏ పూర్వ అధ్యక్షులు బాలాజీరావు, ఫిల్మ్ ఛాంబర్ పూర్వపు అధ్యక్షులు కాట్రగడ్డ ప్రసాద్,ఇంకా రవిచంద్రన్ విచ్చేసి శుభాకాంక్షలు తెలియచేశారు. అలాగే రూ. 10వేలను లయన్స్ ఐ డొనేషన్ ప్రాజెక్టుకు, రూ.10వేలు డయాలసిస్ ప్రాజెక్ట్ కు గాను తన వంతు సహకారాన్ని పుట్టిన రోజు సందర్భంగా ప్రతినిధులకు అందచేశారు.
తిరువొత్తియూరు: చైన్నె అంబత్తూరు సమీపంలోని పాడి, గోపాల్ నాయకర్ నగర్, కామరాజర్ వీధికి చెందిన పాత ఇనుప సామాన్ల వ్యాపారి ఉమర్ ఫారూఖ్. ఈయన గత నెల 25వ తేదీన తన వ్యాపార అవసరాల కోసం బ్యాంకు నుండి రూ. 18.80 లక్షల నగదును తీసుకుని, కొరట్టూరు 2వ ప్రధాన రహదారి గుండా ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఆ సమయంలో ఆయనను అడ్డుకున్న నలుగురు వ్యక్తుల గుర్తుతెలియని ముఠా, ఉమర్ ఫారూఖ్ చేతిలోని రూ. 18.80 లక్షల నగదు సంచిని లాక్కుని పారిపోయారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై కొరట్టూరు పోలీసులు కేసు నమోదు చేసి, ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించి, గుర్తుతెలియని వ్యక్తుల కోసం ముమ్మరంగా విచా రణ చేపట్టారు. ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, ఆవడి నగర పోలీస్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు, జాయింట్, డిప్యూటీ, అసిస్టెంట్ కమిషనర్ల పర్యవేక్షణలో, కొరట్టూరు పోలీస్‌స్టేషన్ ఇన్ స్పెక్టర్లు జార్జ్ మిల్లర్, పొన్రాజ్, అలమేలుతో కూడిన 3 ప్రత్యేక బందాల పోలీసులు రంగంలోకి దిగి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో, రూ.18.80 లక్షల దోపిడీ కేసులో గత 28వ తేదీన ప్రధాన నిందితుడు సతీష్‌ను అరెస్ట్ చేశారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు, శనివారం తిరునల్వేలిలో తలదాచుకున్న అహమద్ ఆరీఫ్, ఇసక్కిపాండి, సుడలైముత్తు, ముత్తురాజా, ఆనందకుమార్, మురుగన్ అనే ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కొరట్టూరు పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు. అనంతరం సతీష్‌తో సహా మొత్తం 7 గురిని పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. వారి నుంచి దోపిడీ చేసిన సొమ్ములో రూ.7.05 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.


