అసెంబ్లీలో చట్ట సవరణకు పట్టు
ఎన్నికల సంస్కరణల్లో భాగంగా కొత్త విధానాలను అమలు చేసేందుకు విజయ్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు స్థానిక ఎన్నికల్లో ఆన్‌లైన్ ద్వారా నామినేషన్లు స్పీకరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వివిధ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి సూచనలు చేస్తుండడం ఆసక్తికరంగా మారింది.
సాక్షి, చైన్నె: తమిళనాడులో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆన్‌లైన్ ద్వారానే నామినేషన్ దాఖలు చేసే విధంగా కొత్త విధానం తీసుకురావాలన్న నినాదం తెర మీదకు వచ్చింది. ఇందుకోసం రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం చట్ట సవరణ చేయాలని పౌర సమాజం, సామాజిక కార్యకర్తల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పాలకులు ఈ వ్యవహారంపై పరిశీనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ విధానం ద్వారా ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాకుండా పారదర్శకత పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎన్నికల నేపథ్యం – పదవీ కాలాలు
తమిళనాడులోని 38 జిల్లాల పరిధిలో ఉన్న గ్రామీణ స్థానిక సంస్థలలో 37 జిల్లా పంచాయతీలు, 397 పంచాయతీ యూనియన్లు, 12,570 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 1,06,453 వార్డులు ఉన్నాయి. వార్డు కౌన్సిలర్, గ్రామ పంచాయతీ సర్పంచ్ (అధ్యక్షుడు) పదవులకు సంబంధించి 1,18,978 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఉప సర్పంచ్, యూనియన్ చైర్మన్, జిల్లా పంచాయతీ చైర్మన్ వంటి 5,973 స్థానాలకు పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తారు.
కార్పొరేషన్లు..
ఇక, నగర పాలక సంస్థలుగా 25 కార్పొరేషన్లు, 146 మున్సిపాలిటీలు, 478 నగర పంచాయతీలు ఉండగా, వీటిలో 12,838 వార్డులు ఉన్నాయి. 12,838 కౌన్సిలర్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు జరుఉతాయి. మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్ వంటి 13,373 స్థానాలకు పరోక్ష ఎన్నికలు జరుగుతాయి. గ్రామీణ స్థానిక సంస్థల్లో 28 జిల్లాల పదవీ కాలం ఇప్పటికే ము గియగా, కాంచీపురం, వేలూరు సహా మిగిలిన 9 జిల్లా ల పదవీ కాలం అక్టోబరు 19తో పూర్తికానుంది. నగర పాలక సంస్థల పదవీ కాలం 2027 మార్చి1తో ముగి యనుంది.ఆన్‌లైన్ నామినేషన్ల ఆవశ్యకత స్థానిక సంస్థల్లో మొత్తం 1,31,816 పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగనుండటంతో, సుమారు 5 లక్షల మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.
ప్రధాన సమస్యలు – పరిష్కారం
అభ్యర్థులు భారీ ర్యాలీలతో ఎన్నికల అధికారుల కార్యాలయాలకు చేరుకోవడం వలన ప్రధాన రహదారుల్లో తీవ్ర ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ–సేవ కేంద్రాల ద్వారా ప్రజలు కుల ధ్రువీకరణ పత్రాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్న తరహాలోనే నామినేషన్లను కూడా ఆన్‌లైన్‌లో స్వీకరించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆల్మారేషన్ (ఇతరుల పేరుతో దరఖాస్తు చేయడం) అరికట్టేందుకు ఆధార్ ఓటీపీ ప్రామాణీకరణ ఆధారంగా ఆన్‌లైన్ దాఖలు ప్రక్రియను పూర్తి చేయవచ్చని సామాజిక కార్యకర్తలు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఆగస్టులో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ మేరకు చట్ట సవరణ తీసుకొస్తే ఎన్నికల నిర్వహణ మరింత సజావుగా, డిజిటల్ విధానంలో పారదర్శకంగా సాగుతుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక, నగర పాలక సంస్థల ఎన్నికల దిశగా రాష్ట్ర ఎన్నికల అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ప్రత్యేక కార్యాచరణ తదుపరి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. అంతలోపు ఆన్‌లైన్‌లో నామినేషన్ల ప్రక్రియను సైతం అమలు చేసే దిశగా పాలకులు పరిశీలన చేస్తున్నట్టు సమాచారం.


