సాక్షి, చైన్నె: తమిళనాడులో టాస్మాక్ మద్యం దుకాణాలకు అనుబంధంగా నడిచే బార్ల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటివరకు టాస్మాక్ వైన్ షాప్ ఉన్న భవనంలోనే బార్ ఏర్పాటు చేయాలనే నిబంధన ఉండేది. దానిని సడలిస్తూ, వైన్ షాప్ ఉన్న ప్రదేశానికి 100 మీటర్ల పరిధిలో ఎక్కడైనా బార్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. అలాగే బార్‌కు ఉండాల్సిన కనీస విస్తీర్ణాన్ని 15 చదరపు మీటర్ల నుండి 20 చదరపు మీటర్లకు పెంచారు. భవన యజమానుల వద్ద నో–అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చేవారే టెండర్ వేసే పరిస్థితి మారడంతో తాజాగా ప్రతిఒక్కరికీ టెండర్లలో పాల్గొనే అవకాశాలు పెరిగాయి. దీంతో టాస్మాక్ బార్ల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి.
రూ. 100 కోట్ల స్థలం కబ్జా కేసు
సాక్షి, చైన్నె: కరూర్‌లో రూ. 100 కోట్ల విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కేసుకు సంబంధించి అన్నాడీఎంకే మాజీ మంత్రి ఎం.ఆర్. విజయభాస్కర్ సోమవారం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు–1లో విచారణకు హాజరయ్యారు. వివరాలు.. కరూర్ జిల్లా వాంగల్ ప్రాంతానికి చెందిన ప్రకాష్ అనే వ్యక్తి, తన వద్ద ఉన్న రూ. 100 కోట్ల విలువైన 22 ఎకరాల భూమిని నకిలీ పత్రాల (ఫోర్జరీ) ద్వారా మాజీ మంత్రి ఎం.ఆర్. విజయభాస్కర్, ఆయన తమ్ముడు శేఖర్ , వారి అనుచరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసుకున్నారని 2024 జూన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కరూర్ టౌన్ పోలీసులు 17 మందిపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసు విచారణ సీబీసీఐడీకి బదిలీ అయ్యింది. నెల రోజులకు పైగా పరారీలో ఉన్న విజయభాస్కర్‌ను 2024 జులై 16న కేరళలోని త్రిస్సూర్లో సీబీసీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసు విచారణ కరూర్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు–1లో సాగుతోంది. జూలై 20న కోర్టుకు హాజరైన మాజీ మంత్రి విజయభాస్కర్ ఛార్జ్‌షీట్ కాపీని అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం మేజిస్ట్రేట్ భరత్‌కుమార్ సమక్షంలో జరిగిన తదుపరి విచారణకు విజయభాస్కర్ స్వయంగా హాజరయ్యారు.
ప్రేమించలేదని విద్యార్థిపై కత్తితో దాడి
– పోలీసులకు భయపడి యువకుడి ఆత్మహత్య
అన్నానగర్: తనను ప్రేమించడానికి నిరాకరించిన ప్లస్–1 విద్యార్థిని ఇంట్లోకి చొరబడిన యువకుడు, ఆమెను కత్తితో పొడిచి, అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. వివరాలు.. కడలూరు జిల్లా, చిదంబరం సమీపంలోని సి. ముట్లూరు ప్రాంతానికి చెందిన ఎలక్ట్రీషియన్ శేఖర్ కుమారుడు అయ్యప్పన్ (28), పక్క గ్రామానికి చెందిన ఓవిద్యార్థినిని రెండేళ్లుగా ప్రేమించమని వేధిస్తున్నాడు. ఆ బాలిక ప్రేమకు నిరాకరించడంతో.. ఆదివారం సాయంత్రం విద్యార్థిని ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకున్న అయ్యప్పన్, తనను ప్రేమించమని బలవంతం చేశాడు. విద్యార్థిని ఒప్పుకోకపోవడంతో.. ఆగ్రహానికి గురైన అయ్యప్పన్, కత్తితో విద్యార్థిని మెడ, వీపు పై పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. విద్యార్థిని కేకలు విన్న ఇరుగుపొరుగు వారు ఆమెను రక్షించి చిదంబరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. విద్యార్థినికి అక్కడ ఇంటెన్సివ్ ట్రీట్‌మెంట్ అందుతోంది. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పరారీలో ఉన్న అయ్యప్పన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతలో, సి.ముట్లూరు ప్రభుత్వ ఆర్ట్స్ కళశాల వెనుక చెట్టుకు అయ్యప్పన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అతడి మృతదేహాన్ని చిదంబరంలోని జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు భయపడి బాలికను కత్తితో పొడిచిన యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
చైన్నె సచివాలయం వద్ద మహిళ ఆత్మహత్యా యత్నం
తిరువొత్తియూరు: విలుప్పురం జిల్లాకు చెందిన సుమారు 45 ఏళ్ల అర్చన అనే మహిళ భూమి వివాదం సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో, చైన్నె సచివాలయంలోని ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగానికి ఫిర్యాదు చేయడానికి సోమవారం వచ్చింది. ఆ సమయంలో తన సమస్యకు పరిష్కారం దొరకలేదని మనస్తాపం చెంది, ధరించిన చీరకి నిప్పు పెట్టుకుని ఆత్మహత్యకు యత్నించింది. దీనిని గమనించిన పోలీసులు వెంటనే మంటలను ఆర్పి, ఆమెను ఆత్మహత్యా ప్రయత్నం నుండి కాపాడి ఆసుపత్రికి తరలించారు.


