సాక్షి, చైన్నె: అభ్యర్థుల అనర్హత పిటిషనన్‌పై విచారణకు సంబంధించి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామితో పాటుగా నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి సమన్లు జారీ చేశారు. ఈనెల 30న స్పీకర్ ఎదుట వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శి ఆర్.శాంతి ఆ సమన్లలో పేర్కొన్నారు.
విశ్వాస పరీక్ష: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే 47 స్థానాలు సాధించినవ విషయం తెలిసిందే. అయితే, టీవీకే చీఫ్ విజయ్ తన విశ్వాస పరీక్షలో నెగ్గేందుకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు కోరినట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఇందుకు అనుగుణంగా మే 13న సీఎం విజయ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి సీ.వీ. షణ్ముగం నాయకత్వంలో ఎస్.పి. వేలుమణి, సి. విజయభాస్కర్ సహా 25 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేశారు. పళని స్వామి నాయకత్వంలోని 22 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటు వేశారు.
విప్ ఉల్లంఘన – అనర్హత పిటిషన్: విప్ ఉల్లంఘించి టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన 25 మంది ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని పళనిస్వామి వర్గం స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌కు వినతిపత్రం ఇచ్చింది.అదే సమయంలో సీ.వీ. షణ్ముగం వర్గానికి చెందిన ఇసక్కి సుబ్బయ్య (అంబసముద్రం), మరగదం కుమారవేల్ (మదురాంతకం), సత్యభామ (ధారాపురం), జయకుమార్ (పెరుందురై) నలుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరారు. ఇక, షణ్ముగం వర్గంలోని మిగిలిన 21 మంది ఎమ్మెల్యేలు క్షమాపణ లేఖ ఇవ్వడంతో వారిపై అనర్హత చర్యల పిటిషన్‌ను పళని స్వామి వెనక్కి తీసుకున్నారు.
వివరణకు సమన్లు
పార్టీ మారిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలను ఇప్పటికే జూలై మొదటి, రెండో వారంలో స్పీకర్ విచారించారు. వారి నుంచి మరిన్ని వివరణలు తీసుకోవాల్సి ఉన్నందున, ఈనెల 30న స్పీకర్ ఛాంబర్‌లో హాజరుకావాలని అసెంబ్లీ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అదే సమయంలో ఫిర్యాదుదారుడైన ఎడప్పాడి పళని స్వామి కూడా స్వయంగా వచ్చి తమ వాదనలను వినిపించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.


