హౌసింగ్ బోర్డులలో
ప్రత్యేక కార్యాచరణ
రంగంలోకి ఐదుగురు సభ్యుల ప్రత్యేక కమిటీ
శాశ్వత పరిష్కారం దిశగా ముందుకు..
సాక్షి, చైన్నె: చైన్నె,శివారు పరిసర ప్రాంతాల్లోని తమిళనాడు అర్బన్ హ్యాబిటాట్ డెవలప్‌మెంట్ బోర్డు గృహాలలో నివాసితులకు ఎలాంటి అంతరాయం లేకుండా తాగునీరు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి కిర్లోష్ కుమార్ తెలిపారు. గత పదేళ్ల కాలంలో ఎన్నోర్, వ్యాసర్‌పాడి, పట్టినపాక్కం, చేట్ పట్, కన్నగి నగర్, ఎళిల్ నగర్, సెమ్మంజేరి, కొట్టివాక్కం, అయ్యప్పాక్కం సహా 207 ప్రాజెక్ట్ ప్రాంతాల్లో లక్షకు పైగా నివాస గృహాలను నిర్మించి లబ్ధిదారులకు అందించారు. ఈ హౌసింగ్ బోర్డు, క్వార్టర్స్‌లలో లక్షలాది మంది నివసిస్తుండగా, మెట్రో వాటర్ (చైన్నె తాగునీటి సరఫరా బోర్డు) అందిస్తున్న నీరు సరిపోవడం లేదని స్థానికులు తరచూ ఫిర్యాదు చేస్తున్నారు. కన్నగి నగర్,ఎళిల్ నగర్‌లలో నీటి ట్యాంకులను రెండు రోజులకు ఒకసారి మాత్రమే నింపడం వలన తాగునీటితో పాటు రోజువారీ అవసరాలకు కూడా తీవ్ర నీటి కొరత ఎదురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ చర్యలు – ప్రత్యేక కమిటీ
ఈ సమస్యలపై స్పందించిన గృహనిర్మాణ శాఖ నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు తక్షణ చర్యలు చేపట్టారు. 5 మంది సభ్యుల కమిటీని రంగంలోకి దించారు. అర్బన్ హ్యాబిటాట్ డెవలప్‌మెంట్ బోర్డు, చైన్నె మెట్రో వాటర్ బోర్డు, కార్పొరేషన్ జోనల్ అధికారులు ఈ ప్రత్యేక కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఆయా ప్రాంతాలలో తాగునీరు, పారిశుధ్యం తదితర ప్రాథమిక సౌకర్యాలను క్షేత్రస్థాయిలో నేరుగా పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పిస్తారు. తాజాగా ఈ కమిటీ ఒక్కియం తురైపాక్కం, సెమ్మంజేరి ప్రాంతాలలో తనిఖీలపై దృష్టి పెట్టింది. చైన్నె మెట్రో వాటర్ మేనేజింగ్ డైరెక్టర్ టి.ఆనంద్ పేర్కొంటూ, ఎళిల్ నగర్‌లో 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల భూగర్భ నీటి నిల్వ ట్యాంక్ నిర్మాణం, పంప్ సెట్ల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయన్నారు.కన్నగి నగర్‌లో 38 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఓవర్ హెడ్ ట్యాంక్, 24 లక్షల లీటర్ల సామర్థ్యంతో భూగర్భ నీటి నిల్వ ట్యాంక్ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. ఈ నిర్మాణ పనులన్నీ సెప్టెంబరు నాటికి పూర్తి చేసి ప్రజల వినియోగానికి తీసుకురానున్నామన్నారు. దీంతో ఇక్కడి వేలాది కుటుంబాలకు తాగునీటి ఎద్దడి నుంచి శాశ్వత ఉపశమనం లభించనున్నుట్టు పేర్కొన్నారు.


