తమిళసినిమా: దినందోరుమ్ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన నాగరాజ్ ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో దినందోరుమ్ నాగరాజ్‌గా ముద్ర వేసుకున్నారు. ఈయన అంతకు ముందు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన మిన్నలే,కాక్క కాక్క చిత్రాలకు కథా రచయితగా పని చేశారు. కాగా తాజాగా ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి ఆకాయం అని టైటిల్‌ను నిర్ణయించారు. కన్నిమాడమ్ చిత్రం ఫేమ్ శ్రీరామ్ కార్తీక్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా నటి ఆలిషా మిరాణి నాయకిఇగా పరిచయం అవుతున్నారు. నటి షీలా, కనిక ,సంతాన భారతి, జయ ప్రకాష్, గిరి ద్వారకేష్ ,మెయ్యప్పన్ చిత్రం ఫేమ్ శ్రీ మణికంఠన్, దీప ,మహారాజా చిత్రం ఫేమ్ సంజన నమితాస్ ,డైరెక్టర్ హరిహరన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కార్తీక్ నల్ల ముత్తు ఛాయాగ్రహణం, రఘునందన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని డెల్టా టాకీస్ పతాకంపై జయచంద్రన్, కార్తీకదేవి నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను నటుడు విజయ్ సేతుపతి తన సామాజిక మాధ్యమం ద్వారా విడుదల చసినట్లు యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి ప్రేక్షకుల మధ్య మంచి ఆదరణ లభిస్తుందని చెప్పారు. వైవిధ్యభరిత కథకు కమర్షియల్ అంశాలను జోడించి జనరంజకంగా రూపొందిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయని త్వరలోనే చిత్ర ఆడియో, ట్రైలర్ లను విడుదల చేసి చిత్రాన్ని కూడా తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


