వేలూరు: విద్యార్థులకు క్రీడలతోనే శారీరక ఉల్లాసం పెరుగుతుందని కాట్పాడి డీఎస్పీ విజికుమార్ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి సన్‌బీమ్ సీబీఎస్‌సీ పాఠశాలలో వార్షికోత్సవ క్రీడా దినోత్సవ కార్యక్రమం పాఠశాల చైర్మన్ హరిగోపాలన్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పాఠశాల విద్యలోనే విద్యార్థులకు క్రమశిక్షణను అలవాటు చేయాల్సిన బాధ్యత పాఠశాలలోని టీచర్‌లతో పాటు తల్లిదండ్రులపై ఆదారపడి ఉందన్నారు. విద్య అనే ఆయుధంతో ఉన్నత శిఖరాలకు వెళ్లడంతో పాటు దేశాభివృద్ధి సాధించగలమన్నారు. విద్యార్థులు ఆడుతూ పాడుతూ చదివే విధంగా అలవాటు చేయాలే తప్పా కఠినంగా శిక్షించి ప్రతి నిమషం చదువుపైనే ద్యేష పెట్టే విధంగా చేయరాదన్నారు. పాఠశాలలోను, నివసించే ఇంటి వద్ద కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే వారు ఎటువంటి చెడు అలవాట్లకు బానిస కాకుండా క్రమ శిక్షణ గల విద్యార్థులుగా ఉండగలరన్నారు. విద్యార్థులకు ఇష్టమైన పనులు చేసేందుకు అవకాశం కల్పించాలన్నారు. విద్యార్థులు వీరి జీవితాలను ఆరోగ్యంగా ఉండే విధంగా చూడాలన్నారు. విద్యార్థులకు పట్టుదల, క్రమ శిక్షణ చిన్న వయస్సు నుంచే ప్రతి ఒక్కరికీ అవసరమని అప్పుడే ఉన్నత శిఖరాలకు వెళ్లగలరన్నారు. వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులతో పాటు సర్టిఫికెట్లును అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ తంగ ప్రకాశం, వైస్ చైర్మన్ జార్జీ అరవింద్, విద్యార్థి నాయకుడు రోహిత్ రామ్ పాల్గొన్నారు.


