సాక్షి, చైన్నె: 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ముందుగా, రాష్ట్రంలోని రైతులు , వ్యవసాయ ఆధారిత రంగాల ప్రతినిధుల అభిప్రాయాలను స్వీకరించేందుకు చైన్నెలోని అన్నా శతాబ్ది గ్రంథాలయ ప్రాంగణంలో సోమవారం రాష్ట్రస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. వ్యవసాయం , రైతు సంక్షేమ శాఖ మంత్రి వినోద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామీణాభివృద్ధి, జలవనరుల శాఖ మంత్రి ఎన్. ఆనంద్ నేతృత్వం వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, ఆహార సరఫరా, చేనేత, సహకార, పశుసంవర్ధక, మత్స్య, అటవీ, పర్యావరణ , ఎంఎస్‌ఎంఈ శాఖలకు చెందిన పదిమంది మంత్రులతో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. ఇందులో రైతుల భాగస్వామ్యం గురించి వివరించారు. చైన్నె మినహా మిగిలిన 37 జిల్లాల రైతుల అభిప్రాయాలను సేకరించి సీఎంకు నివేదించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ బడ్జెట్‌లో భూసార పునరుద్ధరణ, నీటి నిర్వహణ, వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలు, యువతకు అవకాశాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పంటలకు మద్దతు ధరల రక్షణ , పంట భీమా అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అభిప్రాయాలను సేకరించారు. కాగా, రైతు సంఘాల ప్రతినిధులతో దక్షిణ భారత రైతు సంఘం నేత అయ్యాకన్ను సచివాలయం సమీపంలో నిరసనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయన్ని పోలీసులు బుజ్జగించారు. కరువై దెబ్బ తినడంతో రైతులను ఆదుకోవాలని ఆయన నినదించారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.


