సాక్షి, చైన్నె : తమిళనాడులో ప్రతిపాదించిన 5 కొత్త రైల్వే ప్రాజెక్టుల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లభించడం లేదని, భూసేకరణలో తీవ్ర జాప్యం జరుగుతోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభ వేదికగా ఆరోపించారు. లోక్‌సభ సమావేశాల్లో డీఎంకే ఎంపీ అరుణ్ నెహ్రూ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తమిళనాడులో రైల్వే ప్రాజెక్టుల పురోగతికి భూసేకరణే అతిపెద్ద అడ్డంకిగా మారిందని స్పష్టం చేశారు. తమిళనాడులోని రైల్వే ప్రాజెక్టులకు మొత్తం 4,612 హెక్టార్ల భూమి అవసరమైందని, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 1,178 హెక్టార్లను (26% మాత్రమే) సేకరించి అప్పగించిందని వివరించారు. అత్తి పట్టు – పుత్తూరు, పట్టుక్కోటై –మన్నార్గుడి, తంజావూరు – పట్టుక్కోటై, దిండివనం – తిరువణ్ణామలై, మొరప్పూర్ – ధర్మపురి ప్రాజెక్టులు మినహా తాంబరం – చెంగల్పట్టు 4వ లైన్, అరక్కోణం – చెంగల్పట్లు డబ్లింగ్, ఈరోడ్ – కరూర్ డబ్లింగ్, తిరుపతి – కాట్పాడి డబ్లింగ్ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. అంతేకాకుండా పెరంబలూరు ప్రజల విజ్ఞప్తి మేరకు నామక్కల్ – అరియలూరు మార్గంలో కొత్త లైన్ తుది సర్వేకి ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు.


