ఆధారాలుంటేనే సీబీఐ విచారణ | - | Sakshi
Sakshi News home page

ఆధారాలుంటేనే సీబీఐ విచారణ

Jun 17 2026 12:22 AM | Updated on Jun 17 2026 12:22 AM

● ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టు స్పష్టీకరణ

సాక్షి, చైన్నె: తమిళనాడులో ఎమ్మెల్యేల భేరసారాలకు సంబంధించి తగిన ఆధారాలు లేకుండా సీబీఐ విచారణకు ఆదేశించలేమని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు నలుగురు రాజీనామా వ్యవహారం కోర్టుకు చేరింది.

కోర్టులో పిటిషన్‌

తిరుచెందూరుకు చెందిన రామ్‌కుమార్‌ ఆదిత్యన్‌ మద్రాస్‌ హైకోర్టులో ఒక ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. మే 13వ తేదీన ప్రభుత్వ విశ్వాస పరీక్ష అనంతరం అన్నాడీఎంకేకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారని గుర్తు చేశారు. తక్షనం వీరాంతా సచివాలయంలోనే మంత్రి ఆధవ్‌ అర్జున సమక్షంలో టీవీకే పార్టీలో చేరారని కోర్టు దృష్టికి తెచ్చారు. దీని వెనుక పెద్ద ఎత్తున భేరసారాలు సాగినట్టుగా అనుమానాలు ఉన్నాయని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.

సీజే బెంచ్‌లో విచారణ

ఈ పిటిషన్‌ మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధర్మాధికారి, జస్టిస్‌ అరుళ్‌ మురుగన్‌తో కూడిన ధర్మాసనం ముందుకు మంగళవారం విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు పిటిషనర్‌ను ప్రశ్నిస్తూ.. ఈ వ్యవహారంలో బేరం జరిగిందనడానికి ఉన్న ఆధారాలు ఏమిటి? కేవలం ఊహాగానాల ఆధారంగా జాతీయ దర్యాప్తు సంస్థ అయిన సీబీఐకి కేసును అప్పగించలేమని స్పష్టం చేశారు. ఇందుకు పిటిషనర్‌ తరపు న్యాయవాది స్పందిస్తూ, ఒక సామాన్య పౌరుడిగా తాము అన్ని ఆధారాలను సేకరించలేమని, అందుకే నిష్పక్షపాత విచారణ కోసం సీబీఐని ఆశ్రయించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం, ఈ కేసు తుది తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు, రాజీనామా చేసిన ఈ నలుగురు ఎమ్మెల్యేల నియోజకవర్గాలు ఖాళీ అయినట్లు ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నాలుగు స్థానాలకు త్వరలోనే ఉపఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ లోగా హైకోర్టులో ఈ కేసు దాఖలు కావడం మున్ముందు ఎలాంటి చర్చలు తెర మీదకు రానున్నాయో వేచి చూడాల్సిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement