సాక్షి, చైన్నె: తిరునల్వేలి(నైల్లె) నగరంలో మంగళవారం ఆర్మీకి చెందిన ఓ హెలికాఫ్టర్ పలుమార్లు చక్కర్లు కొట్టడంతో ఉత్కంఠ నెలకొంది. ఇది తక్కువ ఎత్తులో చక్కర్లు కొట్టడం స్థానిక ప్రజల్లో కలకలం రేపింది. అయితే ఇది రాబోయే నీట్ పునఃపరీక్ష ప్రశ్నపత్రాల భద్రతా తరలింపునకు సంబంధించిన ముందస్తు రిహార్సల్ (ట్రయల్ రన్) అని అధికారులు వెల్లడించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
21న నీట్ పునఃపరీక్ష
దేశవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం గత మే 3వ తేదీన జరిగిన నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం జూన్ 21వ తేదీ (ఆదివారం) పునఃపరీక్ష నిర్వహించబోతున్నారు. తిరునల్వేలి జిల్లాలో ఈ పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసే పనులు ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతున్నాయి.
భద్రత మధ్య హెలికాప్టర్‌లో ప్రశ్నపత్రాలు..
గతంలో జరిగిన అవకతవకలు , లీకేజీలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈసారి జాతీయ పరీక్షల సంస్థ అత్యంత కట్టుదిట్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగానే ప్రశ్నపత్రాల రవాణాకు సరికొత్త భద్రతా వ్యూహాన్ని దేశ వ్యాపతగా అమలు చేస్తున్నారు. పరీక్ష సమయంలో ప్రశ్నపత్రాలను ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో మదురైకి తీసుకువస్తారు. మదురై విమానాశ్రయం నుండి ఆర్మీ కి చెందిన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఈ ప్రశ్నపత్రాలను నేరుగా తిరునల్వేలికి తరలించనున్నారు. ఈ గగనతల రవాణా ప్రక్రియను పరిశీలించడానికి ఉదయం రిహార్సల్ నిర్వహించారు. ఈ సమయంలో ఆర్మీ హెలికాప్టర్ కేటీసీ నగర్, బహుళార్ధసాధక ప్రభుత్వ ఆసుపత్రి, ఐ–గ్రౌండ్ పాత ఆసుపత్రి , పాలై బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలపై తక్కువ ఎత్తులో చక్కర్లు కొడుతూ ప్రయాణించింది. అనంతరం సాయుధ దళాల మైదానంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో మొదట ఆందోళన చెందిన స్థానికులు, పరీక్షల భద్రత కోసమే ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలడంతో ఊపిరి పీల్చుకున్నారు.


