సేలం: నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఓ కార్మికు డు దుర్మరణం చెందాడు. మరో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. నామక్కల్ జిల్లాలోని పరమతి వెల్లూరు సమీపంలోని పలపట్టికి చెందిన నిర్మాణ కార్మికుడు వెంకటేష్ (21), చెంగపల్లికి చెందిన అతని బంధువు సతీష్ (25) సోమవారం సాయంత్రం నామక్కల్‌లోని గణేశపురం మాతా ఆలయం సమీపంలో నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అప్పుడు ఆ భవనం అకస్మాత్తుగా కూలిపోయింది. వెంకటేష్ భవన శిథిలాల కింద చిక్కుకుని మృతిచెందాడు. సతీష్ కాలుకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ అతన్ని నామక్కల్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్పించారు.మంగళవారం ఉదయం వీరిద్దరి బంధువులు నామక్కల్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం వద్ద గుమిగూడి పరిహారం అందిచాలని ఆందోళన చేశారు. నామక్కల్ సీఐ ఇలవరసన్ వారితో చర్చలు జరిపారు. భవన యజమాని దీప, ఇంజినీర్ ప్రవీణ్, కాంట్రాక్టర్ శివకుమార్‌లపై కేసు నమోదు చేశారు. పరిహారానికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


