సాక్షి, చైన్నె: తమిళనాడు వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో ఒకే రోజు రికార్డు స్థాయిలో 91,369 పెండింగ్ కేసులను పరిష్కరించారు. ఈ కేసుల్లో బాధితులకు మొత్తం రూ.664.47 కోట్ల పరిహారం అందించాల్సిందిగా న్యాయస్థానాలు ఉత్తర్వులు జారీ చేశాయి.ఈ వివరాలను ఆదివారం ప్రకటించారు.ప్రజల సుదీర్ఘ కాల పెండింగ్ కేసులను ఎటువంటి ఖర్చు లేకుండా, అత్యంత వేగంగా పరిష్కరించే లక్ష్యంతో తమిళనాడు రాష్ట్ర చట్టపరమైన సేవల అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు.
506 ప్రత్యేక బెంచ్‌ల ఏర్పాటు
రాష్ట్ర చట్టపరమైన సేవల అధికార సంస్థ అధ్యక్షులు, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ. ధర్మాధికారి మార్గదర్శకత్వంలో ఈ లోక్ అదాలత్ సాగింది. కేసుల విచారణ కోసం హైకోర్టుతో పాటు జిల్లా, తాలూకా స్థాయిల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. మద్రాస్ హైకోర్టు (చైన్నె)లో 5 ప్రత్యేక బెంచ్‌లు, హైకోర్టు మదురై బెంచ్‌లో 3 ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేసి పెండింగ్ కేసులను విచారించారు.
న్యాయమూర్తుల పర్యవేక్షణ
చైన్నె హైకోర్టులో జస్టిస్ పి. వేల్మురుగన్, జస్టిస్ పి.టి. ఆశా, జస్టిస్ ఎన్. సెంథిల్‌కుమార్, జస్టిస్ జి. అరుళ్ మురుగన్, రిటైర్డ్ జస్టిస్ పి. గోకుల్‌దాస్ నేతృత్వంలో.. అలాగే మదురై బెంచ్‌లో జస్టిస్ పి.పి. బాలాజీ, జస్టిస్ పి. వడమలై, జస్టిస్ పి. ధనపాల్ నేతృత్వంలో విచారణలు జరిగాయి. జిల్లా మరియు తాలూకా స్థాయిల్లో మొత్తంగా 506 ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేసి, ఒకే రోజులో 91,369 కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించారు.
రూ.664.47 కోట్ల భారీ పరిహారం
ఈ లోక్ అదాలత్ ద్వారా రాజీ కుదిరిన కేసులకు సంబంధించి బాధితులకు మొత్తం రూ.664,47,21,308 విలువైన పరిహారపు చెక్కులను అందజేశారు.రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ జాతీయ లోక్ అదాలత్ ఏర్పాట్లను రాష్ట్ర చట్టపరమైన సేవల అధికార సంస్థ సభ్య కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి ఎస్. బాలకృష్ణన్ నేతృత్వంలో ఆయా జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు పర్యవేక్షించారు. ఇందులో భాగంగా చైన్నె సిటీ సివిల్ కోర్టులో జరిగిన లోక్ అదాలత్‌లో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర చట్టపరమైన సేవల అధికార సంస్థ సభ్యులు జస్టిస్ ఎ.డి. జగదీష్ చంద్ర పాల్గొని, కేసుల పరిష్కారం లభించిన లబ్ధిదారులకు పరిహారపు సొమ్ము చెక్కులను స్వయంగా అందజేశారు.


