త్వరలో ప్రత్యేక జిల్లాగా కుంభకోణం | - | Sakshi
Sakshi News home page

త్వరలో ప్రత్యేక జిల్లాగా కుంభకోణం

Jun 15 2026 12:41 AM | Updated on Jun 15 2026 12:41 AM

● మంత్రి వినోద్‌

సాక్షి, చైన్నె : కుంభకోణాన్ని త్వరలోనే ప్రత్యేక జిల్లాగా ముఖ్యమంత్రి ప్రకటిస్తారని వ్యవసాయ శాఖ మంత్రి వినోద్‌ స్పష్టం చేశారు. ఆదివారం కుంభకోణంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి వినోద్‌ మీడియాతో మాట్లాడారు. కుంభకోణం ప్రాంత ప్రజల సుదీర్ఘ డిమాండ్‌ అయిన ప్రత్యేక జిల్లా హోదాపై మంత్రి సానుకూలంగా స్పందించారు. కుంభకోణాన్ని విడిగా ఒక జిల్లాగా ప్రకటించేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసిందని ఆయన తెలిపారు. ఈ విషయమై తాము తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ త్వరలోనే కుంభకోణాన్ని సరికొత్త జిల్లాగా అధికారికంగా ప్రకటిస్తారని మంత్రి హామీ ఇచ్చారు.

2028 మాసి మాహా మహం ఉత్సవాల సమీక్ష

రాబోయే కాలంలో కుంభకోణంలో జరగనున్న ప్రతిష్టాత్మక ’మాసి మాహా మహం’ ఉత్సవాల గురించి మంత్రి కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. 2028లో జరగనున్న ఈ మహా ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే హిందూ దేవాదాయ శాఖ మంత్రితో కలిసి విస్తృతస్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఉత్సవాలకు సుమారు 50 లక్షల మంది వరకు భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. అందుకు అనుగుణంగా భక్తులకు అవసరమైన మౌలిక వసతులు, వివిధ సేవా ప్రాజెక్టుల రూపకల్పనపై ఇప్పుటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

బైపాస్‌ రోడ్డు పనుల పూర్తికి చర్యలు

కుంభకోణం నగరంలో నిలిచిపోయిన రింగ్‌ రోడ్డు (ఔటర్‌ బైపాస్‌) పనులపై ప్రజల నుండి పెద్ద ఎత్తున వినతులు వచ్చాయని మంత్రి తెలిపారు. అసంపూర్తిగా ఉన్న బైపాస్‌ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతూ అనేక మంది వినతి పత్రాలు అందజేశారని, గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టులో ఎలాంటి సాంకేతిక, పరిపాలనాపరమైన సమస్యలు తలెత్తాయో గుర్తించేందుకు ప్రస్తుతం క్షేత్రస్థాయి పరిశీలనకు ఆదేశించామన్నారు. ఆ లోపాలను సరిదిద్ది, మిగిలిపోయిన రింగ్‌ రోడ్డు పనులను అత్యంత త్వరలోనే పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి వినోద్‌ వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement