తమిళసినిమా: చియాన్ విక్రమ్ చిన్నగ్యాప్ తీసుకుని కథానాయకుడిగా నటిస్తున్న చిత్ర షూటింగ్ ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ నటి, నిర్మాత రియా శిబు ఈ చిత్రం ద్వారా కథానాయకిగా కోలీవుడ్‌కు ఎంటర్ అవుతున్నారు. నటుడు విక్రమ్ నటిస్తున్నర 63వ చిత్రం అయిన ఈ చిత్రం కోసం ఆయన చాలా కొత్తగా మేకోవర్ అయ్యారు. కాగా కుటుంబ నేపధ్యంతో సాగే యాక్షన్ ఎంటర్ టెయినర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.కాగా స్టార్ హీరోహీరోయిన్లు చిత్ర లాభాల్లో భాగాన్ని పారితోషికంగా తీసుకోవాలని తమిళ్ నిర్మాతల మండలి చాలా కాలంగా కోరుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఒత్తిడి తీసుకొచ్చేవిధంగా ఇటీవల ఒక్క రోజు షూటింగ్‌లను కూడా రద్దు చేసింది. ఇలాంటి పరిస్ధితుల్లో నటుడు విక్రమ్ తన తాజా చిత్రానికి లాభాల్లో భాగాన్ని పారితోషికంగా తీసుకోవడానికి సమ్మతించినట్లు సమాచారం. ఆయన నటిస్తున్న సత్యజ్యోతి ఫిలింస్ చిత్రానికి పారితోషికంగా రూ. 18 కోట్లు, ఆ తరువాత చిత్ర లాభాల్లో కొంత శాతం, ఓటీటీలో కొంత శాతం పారితోషికంగా తీసుకోవడానికి విక్రమ్ అంగీకరించినట్లు తెలిసింది. కాగా విక్రమ్ వంటి ప్రముఖ హీరో చిత్ర లాభాల్లో శాతాన్ని పారితోషికంగా తీసుకోవడానికి సమ్మతించడంతో ఇదే విధానాన్ని ఇతర హీరోలు అవలంభించే అవకాశం ఉంటుందని భావించవచ్చు.


