భవిష్యత్తులో ప్రమాదం
తిరువళ్లూరు: వ్యవసాయానికి తాగునీటికి ప్రధాన ఆధారంగా వున్న కూవం నదిలో రసాయన కలుషిత నీరు, శుద్ధీకరణ చేయకుండా వదిలే మరుగునీటితో పారిశుధ్యం లోపించి ప్రశ్నార్థఽకంగా మారింది. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ కేశవరం నుంచి కూవం నది ప్రవహిస్తుంది. నది మొత్తం విస్తీర్ణం 400 చదరపు కిలోమీటర్లు కాగా 72 కిమీ మేరకు ప్రవహిస్తుంది. వీటిలో 40 కిమీ తిరువళ్లూరు జిల్లాలోనూ, 18 కిమీ చైన్నెలోనూ ప్రవహిస్తుంది. కేశవరం నుంచి ప్రారంభమయ్యే కూవం పింజివాక్కం, మనవాలనగర్, పుట్లూరు, అరణ్‌వాయల్, పుదుసత్రం, పూందమల్లి, తిరువేర్కాడు, కోయంబేడు వద్ద ప్రవేశించి నేప్పియర్ బ్రిడ్జి వద్ద బంగాళఖాతంలో కలుస్తుంది. మొదట్లో పూందమల్లి వరకు స్వచ్చమైన మంచినీటితోనూ, కోయంబేడు నుంచి మురుగునీరు కలిసి ప్రవహించేది. గతంలో వర్షపు నీటితో ప్రవహించిన కూవం ప్రస్తుతం రంగు మారిన నీటితో ప్రవహిస్తోంది. కూవం నది నీటితో భూగర్బ జలాలు పెరిగి లక్షల ఎకరాల్లో సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా వుంది. కూవం నది ప్రాధాన్యతను దృష్టిలో వుంచుకుని పింజివాక్కం, పేరంబాక్కం, పుట్లూరు, అధిగత్తూరు, పుదుసత్రం ప్రాంతాల్లో ఆనకట్టలు నిర్మించారు. మరో పది ఆనకట్టల నిర్మాణాలకు సైతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే కూవం నదిని పరిరక్షించాల్సిన అధికారులు కనీసం పట్టించుకోకపోవడంతో నది ఉనికి ప్రశ్నార్థకంగా మారుతూవుంది. తాగు, సాగునీటికి ప్రధానం ఆధారంగా వున్న కూవం నది గతంలో వర్షపు నీటితో కళకళలాడింది. ప్రస్తుతం కూవం నది కలుషితమైంది. మనవాలనగర్, ఒండికుప్పం, పుట్లూరు, ఆరణ్‌వాయల్ ప్రాంతాల నుంచి వెలువడే మురుగునీరు నేరుగా కూవం నదిలో వదులుతున్నారు. తిరువళ్లూరు మున్సిపాలిటీ పరిధిలో సేకరించే మురుగునీటిని శుధ్ధీకరణ చేసిన తరువాత విడుదల చేయాల్సి వుండగా, చేయకుండానే వదలడం వల్ల కూవం నది కలుషితమైంది. దీంతో పాటు పలు కంపెనీలకు చెందిన రసాయన నీటిని సైతం శుద్ధీకరణ చేయకుండా వదలడం వల్ల ప్రస్తుతం కూవం నదిలో నీరు రంగు మారి ప్రవహిస్తూవుంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి తాగు, సాగు నీటికి ప్రధాన ఆధారంగా వున్న కూవం నదిని పరిరక్షించి ఉనికి కాపాడాలని పలువురు పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.


