సొంత గుర్తుపైనే పోటీ చేస్తాం! | - | Sakshi
Sakshi News home page

సొంత గుర్తుపైనే పోటీ చేస్తాం!

May 30 2026 12:23 AM | Updated on May 30 2026 12:23 AM

● మైనారిటీ పార్టీలలో మార్పు ● కారణాలేమిటో.?

సాక్షి, చైన్నె: ఇటీవల మనిదనేయ మక్కల్‌ కట్చి అధ్యక్షుడు జవహిరుల్లా చేసిన ఒక కీలక ప్రకటన తాజాగా చర్చల్లోకి చేరింది. ఇకపై ప్రతి ఎన్నికల్లో తాము సొంత గుర్తుపైనే పోటీ చేస్తామని ఆయన ప్రకటించడంతో ఇతర మైనారిటీ పార్టీలు సైతం అదే నినాదాన్ని అందుకునే పనిలో పడ్డాయి. ఇందుకు సొంత గుర్తు (నిచ్చెన) పై పోటీ చేసి గెలిచిన ముస్లిం లీగ్‌కు తాజా ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కడమే కారణంగా చర్చ జరుగుతోంది.

ఇక సంకోచం లేదు

ఈ ఎన్నికల ఫలితం ద్వారా తమిళనాడు చరిత్రలో ద్రవిడ పార్టీల ప్రభుత్వ శకానికి టీవీకే విజయ్‌ ముగింపు పలుకుతూ కొత్త శకానికి నాంది పలికారు. మైనారిటీలో ఉన్న తమ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన పార్టీలన్నింటికి ప్రభుత్వంలో వాటా ఇచ్చి సంకీర్ణ పాలనలో నిమగ్నమయ్యారు. ఇది తాజాగా ఇతర మైనారిటీ పార్టీలతోపాటు చిన్న పార్టీలను ఆలోచనలో పడేశాయి. ‘ మనం కూడా సొంత గుర్తుపై పోటీ చేసి ఉంటే, ఈరోజు మనకు కూడా మంత్రి పదవి దక్కే ఉండేదన్న భావనలో ఆ పార్టీల నేతలు ఉన్నాయి. అందుకే ఇకపై సొంత గుర్తుపైనే పోటీ అనే తీర్మానాన్ని మనిదనేయమక్కల్‌ కట్చి నేత, ఎమ్మెల్యే జవహిరుల్లా మీడియా ఎదుట స్పష్టం చేయడం విశేషం. ఇప్పటికై నా ముస్లిం పార్టీలు, ఉద్యమ పార్టీలు, కుల పార్టీలు కూటమి నాయకత్వంపై సరైన ఒత్తిడి తెచ్చి తమ హక్కులను సాధించుకోవాలన్న నిర్ణయానికి రావడం గమనార్హం. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, ఒక రిజిస్టర్డ్‌ రాజకీయ పార్టీ తన గుర్తింపును కాపాడుకోవాలంటే సొంత గుర్తుపై పోటీ చేయడం తప్పనిసరి కాబట్టే ఇక మున్ముందు కూటమి ఆదేశాలకు అనుగుణంగా వెళ్లబోమన్న నిర్ణయానికి ఆ పార్టీలు వస్తుండడం ఆలోచించ దగ్గ విషయం. అదే సమయంలో మైనారిటీ ఓట్ల కోసం డీఎంకే నాయకత్వం ముస్లిం పార్టీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, సొంత పార్టీలో ఉన్న ముస్లిం నాయకులను, కార్యకర్తలను గుర్తించడం లేదనే అసంతృప్తి స్వరం కూడా ఆ పార్టీలో వినిపిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇకనైనా ఆ పార్టీలలోని మైనారిటీ నేతలకు గుర్తింపు వచ్చేనా అన్న ఎదురుచూపులు పెరిగాయి.

Advertisement
 
Advertisement
Advertisement