సాక్షి, చైన్నె: తమిళనాడు పోలీస్ విభాగానికి సంబంధించి ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర శాంతిభద్రతల విభాగం కొత్త డీజీపీగా మహేష్‌కుమార్ అగర్వాల్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డీజీపీగా విధులు నిర్వహిస్తున్న ఆయన్ను, ఇప్పటివరకు తమిళనాడు డీజీపీగా ఉన్న సందీప్‌రాయ్ రాథోడ్ స్థానంలో నియమించారు.
క్లీన్ ఇమేజ్ అధికారి
మహేష్‌కుమార్‌అగర్వాల్ తమిళనాడు పోలీస్ సర్వీస్‌లో ఎంతో అనుభవం, క్లీన్ ఇమేజ్ ఉన్న సీనియర్ అధికారి. ఆయన 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. స్వస్థలం పంజాబ్ రాష్ట్రం. తండ్రి లాయర్ కావడంతో ఆయన కూడా లా చదివారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి కేవలం 22 ఏళ్ల వయసులోనే ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. గతంలో తేని, తూత్తుకుడి జిల్లాల ఎస్పీగా, చైన్నె బ్రాడ్ వే డిప్యూటీ కమిషనర్‌గా, చైన్నె ట్రాఫిక్ సౌత్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు.
సీబీఐలో సేవలు
డెప్యుటేషన్‌పై తన సొంత రాష్ట్రమైన పంజాబ్‌కు వెళ్లి, అక్కడ ఏడేళ్లు సీబీఐ అధికారిగా పనిచేశారు. పంజాబ్, హర్యానా, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో పనిచేశారు. ఐజీగా పదోన్నతి పొందినానంతరం తమిళనాడుకు తిరిగివచ్చిన ఆయన సీబీసీఐడీలో పనిచేశారు. తర్వాత మదురై పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. చైన్నె సౌత్ జోన్ అడిషనల్ కమిషనర్‌గా, ఎన్‌న్‌ఫోర్స్‌మెంట్ ఏడీజీపీగా పనిచేశారు. 2020లో చైన్నెకి అత్యంత పిన్న వయస్కుడైన పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి అప్పట్లో రికార్డు సృష్టించారు.
9 నెలల తర్వాత డీజీపీ నియామకం
గత ఏడాది ఆగస్టు 31న లా అండ్ ఆర్డర్ డీజీపీ శంకర్‌జివాల్ ఉద్యోగ విరమణ చేసినప్పటి నుంచి ఈ పదవి భర్తీపై పలు వివాదాలు, ఉత్కంఠ నెలకొన్నాయి. తొలుత వెంకటరామన్‌ను డీఎంకే పాలకులు ఇన్‌చార్జ్‌గా నియమించి కాలం నెట్టుకొచ్చారు. ఎన్నికల సమయంలో సందీప్‌రాయ్ రాథోడ్ నియమితులయ్యారు. సీఎం విజయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం కొత్త డీజీపీ నియామకానికి చర్యలు తీసుకుంది. యూపీఎస్సీ సిఫారసుల మేరకు ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులలో ఒకరైన మహేష్‌కుమార్‌అగర్వాల్‌కు డీజీపీ పదవి దక్కింది.


