తిరుత్తణి: ఆంధ్రాలో పెట్రోల్, డీజిల్ కొరతతో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు ఏర్పాటయ్యాయి. దీంతో ఆంధ్రా ప్రజలు సరిహద్దులోని తిరుత్తణి, పళ్లిపట్టు ప్రాంతాలకు సోమవారం పోటెత్తారు. ఇంధనం వాహనాలకు ఫుల్ చేసుకుని, క్యాన్లు, వాటిర్ బాటిళ్లలో నింపుకెళ్లారు. అమెరికా, ఇరాన్ యుద్ధ నేపథ్యంలో గత నెల దేశ వ్యాప్తంగా ఇంధన కొరత చోటుచేసుకుంది. అయితే ఆ తరువాత పరిస్థితి చక్కబడింది. తమిళనాడులో ఎల్‌పీజీ గ్యాస్ సమస్య తగ్గి వినియోగదారులకు సకాలంలో గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ బంకుల్లో అందుబాటులో ఉంది. అయితే అందుకు భిన్నంగా ఆంధ్రాలో పెట్రోల్, డీజిల్ సమస్య తీవ్రం కావడంతో ఆ రాష్ట్రంలోని సగానికి పైగా బంకులు మూతపడ్డాయి. ప్రధానంగా తిరుత్తణికి సమీపంలోని సరిహద్దు ఆంధ్రా ప్రాంతం చిత్తూరు, పుత్తూరు, నగరి పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు పెట్రోల్, డీజిల్ కోసం తిరుత్తణి, పళ్లిపట్టు, ఆర్కేపేట, అత్తిమాంజేరిపేట, పొదటూరుపేట, కనకమ్మసత్రం ప్రాంతాల్లోని బంకులకు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలతోపాటు ప్రభుత్వ వాహనాలు, కార్లు బంకుల వద్ద క్యూకట్టి డీజిల్, పెట్రోల్ ఫుల్ చేసుకున్నారు. క్యాన్లు, బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ నింపుకుని వెళ్లారు. ఆంధ్రాలో ఇంధనం కొరతపై ఆంధ్రాకు చెందిన రైతు మాట్లాడుతూ వారం రోజులు పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉందని, రెండు రోజులు అన్నీ బంకులు మూతపడి నో స్టాక్ బోర్డులు పెట్టారు. దీంతో 20కిమీ దూరంలోని తమిళనాడు ప్రాంతం తిరుత్తణికి చేరుకుని బైకుకు పెట్రోల్ నింపినట్లు, రైతులు వరి దిగుబడి చేస్తున్న క్రమంలో వరికోత యంత్రాలకు, ట్రాక్టర్లకు డీజిల్ అవసరం కావడంతో క్యాన్లు తీసుకొచ్చి డీజిల్ నింపుకుని వెళ్తున్నామని తెలిపారు.


