ఎన్నికల ప్రచారం కారణంగా ఆర్థికంగా వెసులుబాటు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల ప్రచారం కారణంగా ఆర్థికంగా వెసులుబాటు

Apr 28 2026 8:11 AM | Updated on Apr 28 2026 8:11 AM

– తప్పట్టం కళాకారుల ఆనందం

సాక్షి, చైన్నె: తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారం కారణంగా తమకు ఆర్థిక వెసులుబాటు కలిగిందని చైన్నెకి చెందిన తప్పట్టం (డప్పు వాయిద్యం్ట) కళాకారులు సంతోష వ్యక్తం చేశారు. చైన్నెలో ఏ శుభకార్యమైనా, ఆలయ ఉత్సవాలైనా, రాజకీయ సభలైనా తప్పాట్టం కళాకారుల సందడి తప్పనిసరి. అయితే, ఈసారి ఎన్నికల ప్రచారం తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపిందని వారు చెబుతున్నారు. రాజకీయ అభ్యర్థుల ప్రచారం మొదలవ్వడానికి ముందే ఈ కళాకారులు తమ వాయిద్యాలతో వీధుల్లో సందడి చేశారు. ఆ శబ్దాన్ని వినే ప్రజలు అభ్యర్థి వస్తున్నారని ఇళ్ల నుండి బయటకు వచ్చారు. సాధారణంగా ఓ కళాకారుడు నెలకు 7 నుండి 10 కార్యక్రమాల్లో పాల్గొని సుమారు రూ. 10,000 వరకు సంపాదిస్తారు. మిగిలిన రోజుల్లో పెయింటింగ్‌ వంటి ఇతర పనులకు వెళ్తుంటారు.

35 రోజుల సందడి

ఈసారి ఎన్నికల షెడ్యూల్‌ కారణంగా సుమారు 35 రోజుల పాటు వరుసగా వీరికి అవకాశాలు వచ్చాయి. మార్చి 15 నుండి ఏప్రిల్‌ 21 వరకు రోజూ ఉదయం, సాయంత్రం ప్రచారాల్లో పాల్గొన్నారు.:ఈ ఎన్నికల సీజన్‌లో ఒక్కో కళాకారుడు సుమారు రూ. 45,000 వరకు సంపాదించినట్లు వారు తెలిపారు. అందుకే తమ పాలిట ఎన్నికలు అసలైన పెద్ద పండుగ (తిరువిళా) అని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కార్చిచ్చుతో 5,000 ఎకరాల్లో అటవీ ప్రాంతం దగ్ధం

అన్నానగర్‌: నీలగిరి జిల్లాలోని అవలాంచ్‌ అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న పర్సాన్స్వేలి అటవీ ప్రాంతంలో గత 24వ తేదీన కార్చిచ్చు చెలరేగింది. ఎండ ప్రభావం, గాలి వేగం కారణంగా ఈ కార్చిచ్చు 20కి పైగా ప్రదేశాలకు వ్యాపించి, 5,000 ఎకరాల అటవీ ప్రాంతాన్ని నాశనం చేసింది. 200 మందికి పైగా ప్రజలు కార్చిచ్చును ఆర్పే పనిలో నిరంతరం నిమగ్నమై ఉన్నారు. అయినప్పటికీ, వారు మంటలను ఆర్పడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. గాలి వేగం ఎక్కువగా ఉండడంతో హెలికాప్టర్‌ ద్వారా మంటలను ఆర్పే ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

దివ్యాంగులకు రైళ్లలో మరిన్ని సౌకర్యాలు

– రైల్వే బోర్డు నిర్ణయం

సాక్షి, చైన్నె: రైళ్లలో ప్రయాణించే దివ్యాంగులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేలా రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దివ్యాంగుల కోసం కేటాయించిన ప్రత్యేక కోచ్‌లలో ప్రయాణించేందుకు యూనిక్‌ డిసబిలిటీ ఐడీ కార్డును అనుమతించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు రైల్వే బోర్డు జారీ చేసిన కన్సెషన్‌ పాస్‌ ఉన్నవారు మాత్రమే ప్రత్యేక కోచ్‌లలో ప్రయాణించేవారు. ఇప్పుడు నేషనల్‌ డిజెబిలిటీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ జారీ చేసినయూడీఐడీ కార్డు ఉన్న దివ్యాంగులందరూ ఈ ప్రత్యేక బెర్తులు/కోచ్‌లలో ప్రయాణించవచ్చు. రైల్వే కన్సెషన్‌ పాస్‌ లేని వారు, సాధారణ టికెట్‌ కొనుగోలు చేసి తమ కార్డును చూపడం ద్వారా ప్రత్యేక కోచ్‌లలో ప్రయాణించడానికి అనుమతి పొందుతారు. దీనివల్ల రైల్వే కన్సెషన్‌ పాస్‌ లేని దివ్యాంగులు సాధారణ అన్‌రిజర్వ్‌డ్‌ కోచ్‌లలో రద్దీ మధ్య ప్రయాణించాల్సిన అవసరం తప్పుతుంది.

రైల్వే బోర్డు హెచ్చరిక

కాగా ఇదే సమయంలో దివ్యాంగులకు కేటాయించిన ప్రత్యేక కోచ్‌లలో ఇతరులు ప్రయాణించడంపై రైల్వే బోర్డు కఠినంగా వ్యవహరించనుంది. అనుమతి లేకుండా ఈ కోచ్‌లలో ప్రయాణించే సాధారణ ప్రయాణికులపై రైల్వే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. దివ్యాంగుల హక్కులను కాపాడటం ,వారి ప్రయాణాన్ని సులభతరం చేయడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని ప్రకటించిది.

నీలగిరి, కోవైలకు అలర్ట్‌

సాక్షి, చైన్నె: భానుడు భగ..భగ మండుతున్న వేళ ఈ నెల 30 నుండి మే 2వతేదీ వరకు నీలగిరి, కోయంబత్తూరుతో సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చైన్నె వాతావరణ కేంద్రం సోమవారం ప్రకటించింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు ఇది కొంత ఉపశమనం కలిగించే సమాచారంగా మారింది. కన్యాకుమారి సముద్రం వరకు ఏర్పడిన వాతావరణ గాలి పీడన ద్రోణి కారణంగా ఈ వర్షాలు కురువనున్నాయని తెలిపారు. 28వ తేదీ మంగళవారం పశ్చిమ కనుమల జిల్లాల్లో , తీర ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. 30వ తేది నుంచి నీలగిరి,కోయంబత్తూరు, ఈరోడ్‌, సేలం, ధర్మపురి, కృష్ణగిరిజిల్లాలో భారీ వర్షాలు అకాల తాండవం చేయవచ్చు అని వివరించారు. కాగా, గత వారం రోజులుగా తమిళనాడు,పుదుచ్చేరిలలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. సాధారణం కంటే 5 డిగ్రీల ఫారెన్‌హీట్‌ వరకు ఎక్కువగా నమోదు అవుతూ వచ్చాయి. ఇక చైన్నె, శివారు జిల్లాలో రానున్న రోజుల్లో భానుడి ప్రతా పం మరింత ఎక్కువగా ఉండే అవకాశాలతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement