విజయ్‌దే.. విజయం | - | Sakshi
Sakshi News home page

విజయ్‌దే.. విజయం

Apr 26 2026 2:33 AM | Updated on Apr 26 2026 2:33 AM

● ఓటర్లకు కృతజ్ఞతలు ● పోస్టర్లతో టీవీకే హల్‌చల్‌

సాక్షి, చైన్నె: ఫలితాల ముందే విజయ్‌ గెలిచేశాడు. భారీ ఆధిక్యంతో విన్‌ అంటూ టీవీకే వర్గాలు పోస్టర్లను హోరెత్తిస్తున్నాయి. అంతేకాదు, అధికారంలోకి వచ్చేసినట్టుగా పేర్కొంటూ, ఎవ్వరెవ్వరు మంత్రులు కాబోతున్నారో వారి వివరాలు అంటూ అభిమానులు తమ తమ సామాజిక మాధ్యమాలలలో పోస్టులను హోరెత్తించే పనిలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. 85.15 శాతం ఓటింగ్‌ జరగడంతో వెనుక టీవీకే విజయ్‌ రాజకీయ ప్రవేశం ప్రధాన కారణంగా చర్చ జరుగుతోంది. విజయ్‌కు యువతీ,యువకులు, మహిళలు,నవతరం ఓటర్లు పట్టం కట్టినట్టుగా సమాచారాలు హోరెత్తుతున్నాయి. ఈ పరిస్థితులలో మే 4న జరగనున్న కౌంటింగ్‌పై సర్వత్రా దృష్టి నెలకొంది. అయితే, విజయ్‌ అభిమానులు, టీవీకే వర్గాలు మాత్రం ఒక అడుగు ముందుకు వేసి ఫలితాలు వచ్చేసినట్టుగా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

హల్‌ చల్‌

ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, విజయ్‌ విన్‌ అంటూ సామాజిక మాధ్యమాలలో పోస్టులు, పోస్టర్లను అభిమాన లోకం హోరెత్తిస్తోంది. తమ నాయకుడు భారీ మెజారిటీతో గెలిచారంటూ ఏకంగా కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టర్లు వేయడం చర్చకు దారితీస్తున్నాయి. తిరుప్పోరూర్‌ మాజీ పంచాయతీ అధ్యక్షుడు , ప్రస్తుతం టీవీకేలో చురుగ్గా ఉన్న ’వీరా’ అనే నేత ఈ వినూత్న పోస్టర్‌ను ముద్రించారు. పెరంబూర్‌ నియోజకవర్గం నుంచి విజయ్‌ 70 వేల ఓట్లతో గెలిచినట్టుగా పేర్కొంటూ, ఆయన్ని గెలిపించిన నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుకోవడం గమనార్హం. అలాగే, తిరుప్పోరూర్‌ నియోజకవర్గంటీవీకే అభ్యర్థి విజయరాజ్‌ 30,000 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు ప్రకటించారు. తమ పార్టీకి ఓటు వేసి, విజయ్‌ను ముఖ్యమంత్రిని చేసినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ పోస్టర్లు హోరెత్తడం తాజా హాట్‌ టాఫిక్‌గా మారింది.

’కల్పిత’ కేబినెట్‌

ఇక మరో అడుగు ముందుకేసిన కేడర్‌ విజయ్‌ సీఎం స్థానం అధిరోహించనున్నట్టు, ఆయన కెబినెట్‌లో ఎవ్వరెవ్వరు ఉండబోతున్నారో నిర్ణయించేసి సామాజి క మాధ్యమాలలో హోరెత్తిస్తుండడం విశేషం. కేవలం విజయ్‌ ముఖ్యమంత్రి అవ్వడమే కాకుండా, ఎవరెవ రు ఏ శాఖలకు మంత్రులు అవుతారనే దానిపై కూడా కేబినెట్‌ జాబితాను రూపొందించి వైరల్‌ చేస్తున్నారు.

జంతు రక్షకుల సీరియస్‌

ఎన్నికల ప్రచారంలో భాగంగా పావురానికి పార్టీ రంగులు పూసి గాలిలోకి వదిలేసిన ఘటనపై తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌కు జంతు సంరక్షణ సంస్థ నిరసన వ్యక్తం చేసింది. ఏప్రిల్‌ 19న తిరుచ్చిలో జరిగిన ప్రచారంలో టీవీకే పార్టీ రంగులు పూసిన పావురాన్ని విజయ్‌ ఎగురవేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పీటా సంస్థ విజయ్‌కు తాజాగా లేఖ రాసింది. పక్షుల రెక్కలకు రంగులు పూయడం వలన వాటి శరీర ఉష్ణోగ్రత నియంత్రణ దెబ్బతింటుందని, ఎగిరే సామర్థ్యం తగ్గుతుందని పేర్కొంది. పక్షులు తమ రెక్కలను శుభ్రం చేసుకునే సమయంలో ఆ రంగుల్లోని రసాయనాలు వాటి కడుపులోకి వెళ్లి ప్రాణాపాయం కలిగే అవకాశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం ప్రకారం ఇది తీవ్రమైన నేరమని, అలాగే ప్రచారంలో జంతువులను వాడకూడదన్న ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను ఇది ఉల్లంఘించినట్టుగా పేర్కొన్నారు. రంగులు పూసిన ఆ పావురాలను తక్షణమే చికిత్స కోసం పీటా సంస్థకు అప్పగించాలని కోరారు. భవిష్యత్తులో ఎన్నికల ప్రచారంలో జంతువులను, పక్షులను వాడబోమని పార్టీ తరపున ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని విజయ్‌ను డిమాండ్‌ చేసింది. ఇదిలా ఉండగా ఓటింగ్‌ ప్రక్రియ ముగిసినానంతరం విజయ్‌ ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement