అన్నానగర్: మెలట్టూరు సమీపంలో ఏఐడీఎంకే నాయకుడు హత్యకు గురయ్యాడు. తంజావూరు జిల్లాలోని పాపనాశం తాలూకా, ఉత్తరమంగళం ప్రాంతానికి చెందిన నెల్సన్ రాజ్. ఇతని భార్య గ్రేట్ మేరీ, అదే గ్రామానికి చెందిన మణికంఠన్ కుటుంబం మధ్య గతంలో వీరికి శత్రుత్వం ఉండేది. శుక్రవారం, కొనియకురిచి గ్రామానికి చెందిన నెల్సన్ రాజ్ మామగారైన సింగరాయర్ (60 ) తన కుమార్తెను చూడటానికి ఉత్తరమంగళం గ్రామానికి వచ్చారు.ఆ సమయంలో నెల్సన్‌రాజ్ కుటుంబానికి, మణికంఠన్ కుటుంబానికి మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఆగ్రహించిన మణికంఠన్ కుటుంబం కత్తితో నెల్సన్ రాజ్ ను నరకడానికి ప్రయత్నించాడు. సమీపంలో ఉన్న సింగరాయర్ ఇది చూసి నెల్సన్‌రాజ్‌ను రక్షించడానికి ప్రయత్నించాడు. అప్పుడు మణికంఠన్ కుటుంబం కత్తితో సింగరాయర్‌ను నరికి అక్కడి నుంచి పారిపోయారు. సింగరాయర్ మరణించారు. నెలన్స్ రాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన సింగరాయర్, మెలట్టూరు ప్రాంతంలో అన్నాడీఎంకే వార్డు కార్యదర్శిగా ఉన్నారు.
సాక్షి, చైన్నె: విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) ప్రధానకార్యదర్శి షానవాజ్ నియమితులయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్న షానవాజ్‌కు ఈసారి ఎన్నికలలో పోటీ చేసేఅవాశం వీసీకే నేత తిరుమావళవన్ ఇవ్వలేదు.అయినా, ఆయన పార్టీ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా విస్తృతంగా పర్యటించారు. ఎన్నికల ఫలితాల అనంతరం షానవాజ్ మాజీ కానున్నారు. దీంతో ఆయన్ను పార్టీ పరంగా అందలం ఎక్కిస్తూ తిరుమావళవన్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన్ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ, పూర్తి స్థాయిలో పార్టీ సేవలకు వినియోగించుకునేందుకు నిర్ణయించారు. అలాగే, పార్టీకోశాధికారిగా ఎస్.ఎస్. బాలాజీ నియమితులయ్యారు. మహమ్మద్ యూసుఫ్ మరణానంతరం ఈ పదవి ఐదేళ్లు ఖాళీగా ఉంటూ వచ్చింది. కాగా, తనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించినందుకు తిరుమావళవన్‌కు షానవాజ్ కృతజ్ఞతలు తెలిపారు.
సాక్షి, చైన్నె: చైన్నె నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో జరిగిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ స్వాతి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉండి, జైలులో మరణించిన రామ్‌కుమార్ మృతిపై దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. 2016లో స్వాతి హత్య కేసులో అరెస్టయిన రామ్‌కుమార్, అదే ఏడాది జైలులో విద్యుత్ తీగను కొరికి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. జైలు అధికారులు, పోలీసుల నివేదికల ఆధా రంగా 2020లో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ కేసును ముగించింది. అదే సమయంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రామ్‌కుమార్ తండ్రి పరమశివం హైకోర్టును ఆశ్రయించారు. తన కుమారుడి మరణంపై మళ్లీ విచారణ జరిపించాలని ఆయన కోరారు. శనివారం ఈ పిటిషన్‌ను విచారించిన చీఫ్ జస్టిస్ ఎస్.ఎ. ధర్మాధికారి, జస్టిస్ జి. అరుల్ మురుగన్ ధర్మాసనం పోలీసుల విచార ణ నివేదికలు, మానవ హక్కుల కమిషన్ నివేదికలు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొంటూ, ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టంచేస్తూ పిటిషన్‌ను తోసి పుచ్చారు.
సాక్షి, చైన్నె: వేసవి కాలం రాగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మామిడి పండ్ల మధురమైన రుచి అన్నది తెలిసిందే. ఈ వేసవిలో మామిడి ప్రియుల కోసం అమెజాన్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల నుండి సేకరించిన తాజా మామిడి పండ్లను నేరుగా వినియోగ దారుల ఇంటికే అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు శనివారం వివరాలను స్థానికంగా ప్రకటించారు. అమెజాన్ ప్లాట్‌ఫామ్‌పై అల్ఫోన్సో, కేసర్, బంగినపల్లి, రసపురి, సింధూరి, సఫేదా వంటి ప్రీమియం రకాల మామిడి పండ్లు అందుబాటులో ఉంచినట్టు వివరించారు. కేవలం పండ్లు మాత్రమే కాకుండా, మామిడితో తయారు చేసిన ఇతర ఉత్పత్తులు కూడా లభిస్తాయని ఫ్రకటించారు. మెట్రో నగరాల్లోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో కేవలం 2 గంటల్లోనే డెలివరీ చేసే సదుపాయం కల్పించినట్టు తెలిపారు.
సాక్షి, చైన్నె: 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి తమిళనాడు విద్యాశాఖ విద్యార్థులకు ముందుగానే శుభవార్త అందించింది. పాఠశాలలు తిరిగి తెరిచే మొదటి రోజే విద్యార్థుల చేతికి పాఠ్యపుస్తకాలు అందేలా తమిళనాడు పాఠ్యపుస్తక, ప్రచురణ సంస్థ ముద్రణ పనులను ముమ్మరం చేసింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, మొత్తం 4.11 కోట్ల పాఠ్యపుస్తకాల ముద్రణ లక్ష్యం కాగా, ఇప్పటికే 88 శాతం పనులు పూర్తి చేసి ఉన్నారు. 2.71 కోట్ల పుస్తకాలను ప్రభుత్వ, ప్రభుత్వ–సహాయక పాఠశాలలకు ఉచితంగా పంపిణీ చేయడానికి చర్లయు తీసుకున్నారు. మిగిలిన 1.4 కోట్ల పుస్తకాలను ప్రైవేట్ పాఠశాలలకు ,బహిరంగ విక్రయాల కోసం కేటాయించారు. కాగా ఈ ఏడాది 1, 2, 3 తరగతులకు కొత్త పాఠ్యప్రణాళికను ప్రవేశపెడుతున్నందున, వాటి తయారీ పనులు తుదిదశకు చేరుకున్నాయి.


