కొరుక్కుపేట: ఉత్తర మద్రాసు ఉగాది మహోత్సవ కార్యవర్గం, సర్ త్యాగరా కళా పరిషత్ సంయక్త ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు శనివారం వైభవంగా జరుపుకున్నారు . చైన్నె పాతచాకలి పేటలోని కన్నిగా పార్టీ హాలు వేదికగా జరిగిన ఈ వేడుకల్లో ముందుగా సంగీత దర్శకులు ఎంఆర్ సుబ్రమణ్యం బృందం ప్రార్థనా గీతంతో సభ ప్రారంభమైంది. బలరామమూర్తి స్వాగతోపన్యాసం, శ్రీ కృష్ణగీతా సమాజము వారిచే గీతాపారాయణం , దేవి మాధవయ్య పంచాంగ పఠనం పఠించారు .సర్ త్యాగరాయ కళా పరిషత్ అధ్యక్షులు డాక్టర్ పి నందివర్మన్, ఉత్తర మద్రాసు కార్యనిర్వాహక వర్గం అధ్యక్షులు ఎంఆర్ సుబ్రమణ్యంలు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాచర్ల మునిరాజు మాట్లాడుతూ దేశ బాషలెందు తెలుగు లెస్స అని వ్యాఖ్యానిస్తూ తెలుగు భాష ఔనత్యాన్ని చాటి చెప్పారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ్యాధ్యక్షులు విస్తాలి శంకర రావు మట్లాడుతూ ఉగాది పండుగ మన తెలుగు వారి పండుగలలో కెల్లా తలమాణికం వంటిదని అభిప్రాయపడ్డారు. ఇంకా తెలుగు ప్రముఖులు డాక్టర్ మోహన శ్రీ , గుడిమెట్ల చెన్నయ్య , పిచ్చుక కుప్పయ్య పాల్గొని ఉగాది వేడుకలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఉగాది పండుగ సందర్భంగా చిన్నారులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. వేడుకల్లో భాగంగా చిన్నారుల నృత్యప్రదర్శనలు , జానపద పాటలకు నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.


