జెండా స్తంభాలకు కొత్త మార్గదర్శకాలు
సాక్షి, చైన్నె: చైన్నెలో తాత్కాలికంగా జెండా స్తూపాలు, స్తంభాల ఏర్పాటుకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ మేరకు చైన్నె కార్పొరేషన్ కమిషనర్ కుమర గురుబరన్ శనివారం ఈ మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ మార్గదర్శకాలు ప్రజల భద్రత, మౌలిక సదుపాయాల రక్షణ, అనుమతి ప్రక్రియను కేంద్రీకరించడం లక్ష్యంగా రూపకల్పన చేశారు. ప్రతి చైన్నె కార్పొరేషన్ జోన్‌లో 15 సబ్–కమిటీలను ఇందు కోసం ఏర్పాటు చేశారు. తాత్కాలిక జెండా స్తంభాలను ఏర్పాటు చేయడానికి అనుమతిని మంజూరు చేసే అధికారులు ఈ కమిటీలు వ్యవహరిస్తాయి. జెండా స్తూపాలు, స్తంభాలు, తదితర వాటి కోసం 15 రోజులు ముందుగా సబ్ కమిటీల వద్ద దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులో స్తంభాల సంఖ్య, ఎత్తు, తదితర వివరాలను పొందు పరచాల్సి ఉంటుంది. తాత్కాలిక జెండా స్తంభాలను మూడు రోజుల పాటు మాత్రమే ఏర్పాటు చేసుకోవచ్చు. రోడ్డు, మీడియన్, ఫుట్‌పాత్, వంతెన, గోడ, వర్షపు నీటి కాలువ వంటి మౌలిక సదుపాయాలపై ఎక్కడా స్తంభాలను ఏర్పాటు చేయడానికి అనుమతి లేదు. ప్రతి స్తంభం గరిష్టంగా 3.50 మీటర్లు ఎత్తులో , కింది భాగంలో కనీసం మీటర్ ఉండే విధంగా చూసుకోవాలి. రాజకీయ పార్టీలు, మతసంస్థలు, సంఘాలు, ఇతర సంస్థలు తమ కార్యక్రమాల కోసం స్తంభాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే రోడ్డు, ఇతర నిర్మాణాలు, మౌలిక సదుపాయాలకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రతి స్తంభానికి ముందస్తుగా రూ. 10 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల కోసం స్తంభాలను గరిష్టంగా 7 రోజుల పాటూ ఏర్పాటు చేసుకోవచ్చు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినపక్షంలో దరఖాస్తుదారుడు మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాగే అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన స్తంభాలను అధికారులు తొలగించి, తగిన చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలలో కమిషనర్ కుమర గురుబరన్ వివరాలను పొందు పరిచారు. కాగా, చైన్నె నగరం రోడ్లు, ఇతర ప్రాంతాలలో నిత్యం వివిధ పార్టీలు, సంఘాలు, సంస్థలు జెండాలను ఏర్పాటు చేయడం పరిపాటిగా మారిన నేపథ్యంలో ఈ కొత్త మార్గదర్శకాలను విడుదల చేయడం విశేషం.


