బ్యాంగ్ బ్యాంగ్ అంటున్న ప్రభుదేవా, వడివేలు
తమిళసినిమా: డాన్సింగ్ కింగ్ ప్రభుదేవా, కామెడీ కింగ్ వడివేలు ది సూపర్ హిట్ కాంబినేషన్ అన్నది తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఇంతకుముందు పలు సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించారు. కాగా సుమారు 25 ఏళ్ల తర్వాత మళ్లీ సూపర్ హిట్ కాంబో రిపీట్ అవుతోంది. ఈ చిత్రానికి బ్యాంగ్ బ్యాంగ్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ క్రేజీ భారీ బడ్జెట్ కథా చిత్రాన్ని కఏఆర్‌ఝఈ కన్నన్ రవి నిర్మిస్తున్నారు. దీపక్ రవి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ రోడ్రిక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం వివరాలను నిర్మాతల వర్గం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అందులో నటుడు ప్రభుదేవా, వడివేలు, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా 25 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి పనిచేస్తున్న చిత్రం ఇది అని చెప్పారు. ఈ సందర్భంగా చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. జాంబీల ఇతివృత్తంతో సాగే హార్రర్ కథా చిత్రంగా రూపొందుతున్న అందులో నటుడు ప్రభుదేవా, వడివేలు కౌబాయ్ దుస్తుల్లో చేతిలో గన్ పట్టి జాంబీలను తరుముతున్న దృశ్యాలు చోటుచేసుకున్నాయి. కాగా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని తుల షెడ్యూల్‌ను ఇండోనేషియాలోని మౌంట్ బ్రోమో అనే ప్రాంతంలో నిర్వహించినట్లు చిత్ర వర్గాలు తెలిపారు. కాగా ఇందులో బబ్లూ పథ్వీరాజ్ మరో కీలకపాత్రను పోషిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి హెచ్ సి. వేణు ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు చెప్పారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను వరుసగా వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.


