బాలీవుడ్ ఎంట్రీ షురూ
ప్రీతి ముకుందన్
తమిళసినిమా: ఇటీవల దక్షిణాది కథానాయికలకు బాలీవుడ్‌లో అవకాశాలు ఎక్కువగా వరిస్తున్నాయనే చెప్పాలి. బాలీవుడ్ హీరోయిన్లు దక్షిణాది చిత్రాలపై ఆసక్తి చూపుతుంటే ఉత్తరాది దర్శక నిర్మాతలు మాత్రం దక్షిణాది హీరోయిన్లపై దృష్టి పెడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్లో దక్షిణాది హీరోయిన్లు నటించడం అన్నది ఇప్పుడు కొత్తేమీ కాదు. ఇంతకుముందే శ్రీదేవి, జయప్రద వంటి పలువురు అక్కడ అగ్ర కథానాయికలుగా రాణించారు. ఇటీవల సాయి పల్లవి, శ్రీలీల వంటి వారు కూడా బాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. తాజాగా మరో కోలీవుడ్ బ్యూటీ బాలీవుడ్‌లో పాగా వేయడానికి సిద్ధమయ్యారు. ఆమె పేరు ప్రీతి ముకుందన్. భరతనాట్యం, క్లాసికల్ వంటి నృత్య కళల్లో శిక్షణ పొందిన ఈ తమిళ అమ్మాయి మోడల్ రంగంలోనూ గుర్తింపు పొందారు. స్టార్ చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగులో ఓం భీమ్ బుష్ చిత్రంతో పరిచయం అయ్యారు. ఆ తరువాత పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన కన్నప్ప చిత్రంలో నటించి మరింత పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా మలయాళంలోను సర్వం మాయ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా తమిళంలో అధర్వకు జంటగా ఇదయం మురళి అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్ నుంచి కాలింగ్ వచ్చిందన్నది తాజా సమాచారం.అక్కడ యువ నటుడు కార్తీక్ ఆర్యన్‌కు జంటగా నటించడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా ఈ అమ్మడి వయసు ఇప్పటికింకా 24 ఏళ్లే అన్నది గమనార్హం. ఇలా అతి పిన్న వయసులోనే పాన్ ఇండియా నటిగా పేరు తెచ్చుకుంటున్నారన్న మాట ఈ బ్యూటీ.


