చైన్నెలో ‘తమిళ ఏఐ’ ఆవిష్కరణ
సాక్షి,చైన్నె : తమిళ భాష, ప్రాచీన జ్ఞానం, ఆధునిక కృత్రిమ మేధస్సు సమ్మేళనంతో ‘తమిళ ఏఐను పరిశోధకుడు డాక్టర్ భాస్కరన్ పిళ్లై రూపొందించారు. దీనిని చైన్నెలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఇందుకు కొత్త డిజిటల్ ప్లాట్ ఫామ్‌గా డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.పీఈఆర్‌ఏఆర్‌ఐవీయూ.ఏఐను ప్రకటించారు. చైన్నెలో జరిగిన ఈ కార్యక్రమంలో భారతదేశం , విదేశాల నుంచి వచ్చిన పరిశోధకులు, శాస్త్రవేత్తల సమక్షంలో డాక్టర్ భాస్కరన్ పిళ్‌లై ‘తమిళ ఏఐ’ సూపర్ ఇంటెలిజెన్స్ గురించి వివరించారు. తమిళ భాషలోని అక్షరాలు, ధ్వనులు, అర్థాత్మక నిర్మాణాలు అత్యున్నత మేధస్సుకు పునాది అవుతాయని పేర్కొన్నారు. తమిళం ఒక దైవిక భాషగా పరిగణిస్తామని, శివుడు, సిద్ధుల సంప్రదాయాల నుంచి ఉద్భవించిన ఈ భాషలోని అగరం అనే భావన క్వాంటం ఇంటెలిజెన్స్‌కు సమీపంగా ఉంటుందని వివరించారు. తమిళ భాష అణు శాస్త్రం, చైతన్యం , ఆధ్యాత్మికతతో అనుసంధానమై ఉందని వ్యాఖ్యలుచేశారు. ప్రాచీన భావనలు సుమారు 1100 సంవత్సరాల క్రితమే ఏఐ తత్వానికి మూలాలుగా ఉన్నాయని తెలిపారు. సూపర్ ఇంటెలిజెన్స్ ప్రయోజనాలు అందరికీ చేరాలని ఆశిస్తున్నప్పటికీ, అది పూర్తిగా అమలులోకి రావడానికి మరో దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో అమెరికా, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఏఐ పరిశోధకలు, శాస్త్రవేత్తలు, వైద్య పరిశోధకులు స్టేసీ లాసన్ , జెస్సికా శ్రీకాంతియా, లారా లిన్, డా. బెక్కీ ప్రోస్ట్కో, డా. ఎ. గౌతమన్ అన్నామలై, దీపా బొప్పన పాల్గొన్నారు.


