ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడ్డాడు
తమిళసినిమా: ప్రముఖ దివంగత నటుడు, రాజకీయనేత విజయకాంత్ వారుసుడు షణ్ముగపాండియన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కొంబుసీవి. నటుడు శరత్‌కుమార్ ప్రధాన పాత్రను పోషించిన ఇందులో నటి తర్ణిక నాయకిగా నటించారు. స్టార్‌సినిమాస్ పతాకంపై ముఖేశ్ చెల్లయ్య నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను పొన్‌రామ్ నిర్వహించారు. యువన్ శంకర్ సంగీతాన్ని అందించిన కొంబుసీవి చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 19వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని కలైవాణర ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఇందులో విజయకాంత్ సతీయణి, డీఎండీకే పార్టీ అధ్యక్షురాలు ప్రేమలత విజయకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంగీత దర్శకుడు ఇళయరాజా కుటుంబంతో తమ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. ఈ చిత్రంలో యువన్ శంకర్‌రాజా అమ్మ అనే పల్లవితో సాగే ఒక పాటకు బాణీలు కట్టారన్నారు. ఆ పాట విని తమ కుటుంబం అంతా కంటతడి పెట్టిందన్నారు. కారణం ఇటీవలే తన తల్లి కన్నుమూశారని పేర్కొన్నారు. ఈ పాటను సంగీత దర్శకుడు ఇళయరాజా, యువన్‌శంకర్‌రాజా కలిసి పాడడం విశేషం. కొంబుసీవి చిత్రం ఒక యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రం అని దర్శకుడు పొన్‌రామ్ పేర్కొన్నారు. నటుడు విజయకాంత్ పెద్ద కొడుకు, రాజకీయ నాయకుడు విజయప్రభాకరన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఒక హీరోకి అన్నయ్యగా తానీ కార్యక్రమంలో పాల్గొనలేదని, ఆయన అభిమానిగా వచ్చాననీ చెప్పారు. షణ్ముగ పాండియన్ 2012 లో నటుడిగా పరిచయం అయ్యారనీ, ఈ 13 ఏళ్లలో తను పలు చిత్రాలు చేసి ఉండాల్సిందనీ, అయితే ఇప్పటికి 4 చిత్రాలే చేశారని చేశారని చెప్పారు. తన తండ్రి అనారోగ్యానికి గురైనప్పుడు చిత్రాలు చేయకుండా తమ్ముడే అన్నీ దగ్గరుండి చూసుకున్నారని చెప్పారు. ఆ సమయంలో నాన్న తనను రాజకీయాల్లోకి పంపారని తెలిపారు. దీంతో షణ్ముగ పాండియన్‌కు కొన్ని చిత్రాలు లభించలేదన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, తను ధైర్యంగా నిలబడ్డాడని అన్నారు. తాను కెప్టెన్ కొడుకును కచ్చితంగా జయిస్తాను అని షణ్ముగ పాండియన్ చెబుతుంటాడని అన్నారు. తనతో అవుతుందనే నమ్మకంతో గత 13 ఏళ్లుగా తన ఫ్యాషన్‌ను వదలలేదని విజయ ప్రభాకరన్ పేర్కొన్నారు.


