సాక్షి, చైన్నె: భారత సాయుధ దళాల సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం పై నిబద్ధతను చాటుకుంటూ, భారత సైన్యం చైన్నెలోని నంగనల్లూరులో అత్యాధునిక ‘గోల్డెన్ పామ్’ వసతి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీనిని బుధవారం సాయుధ దళాల సిబ్బందికి అంకితం చేశారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న సైనికులు, మాజీ సైనికులు (వెటరన్స్), భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ సిబ్బందిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వసతిని అందించడం లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చైన్నె నడిబొడ్డున సరసమైన ధరలకే తాత్కాలిక (ట్రాన్సిట్), దీర్ఘకాలిక వసతిని ఈ కేంద్రం కల్పిస్తుంది. ఇది ‘దక్షిణ భారత్ ఏరియా’ పరిధిలోకి వస్తుంది. ఈ కేంద్రాన్ని దక్షిణ భారత్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ప్రారంభించారు. మిలిటరీ కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో, సాయుధ దళాల ‘కేర్ అండ్ షేర్’ సంస్కృతిని నిలబెట్టడంలో ఇది ఒక కీలక అడుగు అని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి.


