సాక్షి, చైన్నె: రాష్ట్ర బీజేపీలో ఎన్నికల రేసులో నిలిచే అభ్యర్థుల ఎంపిక సవాలుగా మారింది. పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కుస్తీలు పడుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అన్నామలై వంటి నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తుండటంతో అభ్యర్థుల జాబితా విడుదలలో జాప్యం తప్పడం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వివరాలు.. బీజేపీకి 27 స్థానాలను అన్నాడీఎంకే కేటాయించింది. అయితే పల్లడం, తొండముత్తూరు వంటి నియోజకవర్గాలను అన్నాడీఎంకే కేటాయించక పోవడం బీజేపీలో అసంతృప్తిని రగిల్చినట్లయ్యింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ ఉన్నప్పటికీ, ఇతర జిల్లాలో మాజీ అధ్యక్షుడు అన్నామలై మద్దతుదారులే ఎక్కువే. అన్నాడీఎంకేతో కూటమి కోసం అన్నామలైను పదవి నుంచి బీజేపీ అధిష్టానం తప్పించిన విషయం తెలిసిందే. ఈ విషయంగానే అన్నామలైతో పాటూ ఆయన మద్దతుదారులు అధిష్టానంపై గుర్రుగానే ఉంటూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో తాము ఆశించిన నియోజకవర్గాలను అన్నాడీఎంకే నుంచి రాష్ట్ర పార్టీ నాయకత్వం రాబట్టుకోలేక పోవడంతో అసంతృప్తి రాజుకున్నట్టైంది.
అన్నామలైలో అసంతృప్తి జ్వాల
కోయంబత్తూరు ఉత్తర నియోజకవర్గం నుంచి అన్నామలై నుండి పోటీ చేయాలని తొలుత భావించారు. ఇక్కడ మహిళా మోర్చాజాతీయ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ ఇప్పటికే ప్రచారం ప్రారంభించడం చర్చకు దారి తీసింది. అన్నామలై రాకను ఆమె పరోక్షంగా వ్యతిరేకించడం వంటి పరిణామాలు గందరగోళాన్ని పెంచినట్టు సమాచారం. అదే సమయంలో పల్లడం లేదా, తొండాముత్తురు స్థానాలను అన్నాడీఎంకే నుంచి రాబట్టుకోవడంలోపెద్దలు విఫలం కావడాన్ని అన్నామలై తీవ్రంగానే పరిగణించినట్టు సమాచారం. ఇటీవల ప్రధానమంత్రి మోదీ తమిళనాడు పర్యటనకు వచ్చినప్పుడు అన్నామలై ఆయనకు స్వాగతం పలకడానికి రాకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై వనతి శ్రీనివాసన్, నైనార్ నాగేంద్రన్ భిన్నమైన సమాధానాలు ఇవ్వడం అన్నామలై ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉన్నారనే అనుమానాలకు బలం చూకూర్చినట్టైంది.
పీయూష్ గోయల్ రాజీ ప్రయత్నాలు
బీజేపీ అగ్ర నాయకత్వం ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను రంగంలోకి దించింది. ఆయన అన్నామలైని వ్యక్తిగతంగా కలిసి, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని కోరినట్లు సమాచారం. అన్నామలై ఎన్నికల్లో పోటీ చేయనని మొండికేసినప్పటికీ, పార్టీ పట్టుబట్టడంతో ఆయనను మోడకురిచ్చి నియోజకవర్గం నుండి బరిలోకి దించాలని అధిష్టానం ప్రాథమికంగా నిర్ణయించినట్లు సంకేతాలు వెలువడ్డాయి. నామినేషన్ల దాఖలుకు సమయం దగ్గరపడుతున్నా, బీజేపీ అభ్యర్థుల పూర్తి జాబితా విడుదల కాకపోవడానికి ఈ అంతర్గత విభేదాలే కారణమన్న చర్చ జరుగుతోంది. చైన్నెలో తిష్ట వేసి అభ్యర్థుల ఎంపిక కుస్తీలో పీయూష్ నిమగ్నం కావాల్సిన పరిస్థితి . ఈ సమయంలో అన్నామలై చివరి నిమిషంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


