రాష్ట్రానికి ఎస్‌ఐఆర్ ముప్పు!
ఎస్‌ఐఆర్ (సర్) రూపంలో రాష్ట్రానికి ముప్పు బయలు దేరి ఉందని, ఈ వ్యవహారాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు జిల్లాలలో నేతలందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని డీఎంకే అధ్యక్షుడు సీఎం స్టాలిన్ పిలుపు నిచ్చారు. లేని పక్షంలో కుట్రలకు పదును పెట్టి, ముప్పు చుట్టుముట్టే అవకాశాలు ఉన్నట్టు హెచ్చరించారు.
సాక్షి, చైన్నె: చైన్నె తేనాంపేటలోని అన్నా అరివాలయం నుంచి సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆదివారం జిల్లాల కార్యదర్శులతో వీడియో కాన్పరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. జిల్లాల వారీగా జరుగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రి య గురించి చర్చించారు. ఈ ప్రక్రియ రూపంలో స్థానికంగా ఓటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శులు, రీజియన్ ఇన్‌చార్జ్‌లను ఉద్దేశించి స్టాలిన్ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్‌ను పదేపదే వ్యతిరేకించేందుకు గల కారణాలను వివరించారు. ఇది మన అనుకునే వారి ఓటు హక్కును హరింపజేయడానికి పన్నినన కుట్రగా ఆరోపించారు. ఈ ఓటర్లను ఎలా రక్షించుకోవాలో అన్న విషయంపై తాను మార్గనిర్దేశం చేస్తున్నట్టు వివరించారు. సరైన సమయంలో ఓటరు జాబితా సవరణకు చర్యలు తీసుకుంటే ఆహ్వానించ వచ్చు అని, అయితే, ఎన్నిలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉన్నప్పుడు ఆగమేఘాలపై ఈప్రక్రియ చేపట్టడం అనేక అనుమానాలకు దారి తీస్తున్నట్టు వివరించారు. తగినంత సమయం కూడా ఇవ్వకుండా కేంద్రం చేతిలో కీలు బొమ్మగా ఉన్న జాతీయ ఎన్నికల కమిషన్ తమిళనాడులో దూకుడు పెంచి ఉండడం బట్టి చూస్తే, ఏదో ముప్పు అన్నది పొంచి ఉన్నట్టు స్పష్టమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పసటికే ఈ వ్యవహారంపై స్పష్టమైన సమాచారం ఇచ్చి ఉన్నారని గుర్తుచేశారు. కేరళ సీఎం పినరాయ్ విజయన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ సైతం తీవ్రంగా ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తూ వస్తుంటే, కేంద్ర ఎన్నికల కమిషన్ దూకుడుగా ముందుకు సాగడం బట్టి చూస్తే, దీని వెనుక పెద్ద కుట్రే దాగి ఉందన్నది స్పష్టం అవుతోందన్నారు.
నిరసనను జయప్రదం చేద్దాం..
కూటమి పార్టీలతో ఈవ్యవహారం గురించిచర్చించామని అఖిల పక్షం భేటి గురించి గుర్తుచేశారు. ఇందులో ఆమోదించిన తీర్మానాల మేరకు న్యాయ పోరాటానికి చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. అలాగే, ఈనెల 11వ తేదీన అన్ని జిల్లాలో ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా భారీ నిరసనకులు పిలుపు నిచ్చామని గుర్తు చేస్తూ, దీనిని జయప్రదం చేద్దామని పిలుపు నిచ్చారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ రూపంలో ఎన్ని సమస్యలు, గందరగోళాలు ఉన్నాయో అని వివరిస్తూ, దీని గురించి సమగ్ర వివరాలను అందరికి తెలియ చేస్తున్నట్టు వివరించారు. ఈ ప్రక్రియ కోసం సిద్ధం చేసిన దరఖాస్తులలో అనేక గందరగోళాలు, అవకతవకలు ఉన్నట్టు పేర్కొన్నారు. తద్వారా మన అనుకునే వాళ్ల వివరాలను సేకరించడమే కాకుండా, వారి బంధువులు, వారి ఇతర ఆప్తులు అన్న సమాచారాల వివరాల మేరకు వాటన్నింటిని తొలగించేందుకు వ్యూహ రచన చేసి ఉన్నారని ఆరోపించారు. అందరి పేర్లను ఓటరు జాబితా నుండి తొలగించడమే లక్ష్యంగా కుట్రలకు ఎన్నికల కమిషన్ ద్వారా పూనుకుని ఉన్నారని పేర్కొన్నారు. చదువుకున్న, తెలివైన, అత్యంత బాధ్యతాయుతమైన వ్యక్తులు కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చిన దరఖాస్తును చూసి తలలు పట్టుకుంటున్నారని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు ఒక రకమైన సమాధానం ఇచ్చి, దరఖాస్తులలో మరో రకంగా ప్రశ్నలను పొందు పరిచి ఎన్నికల కమిషన్ ఎత్తుగడలను వేసి ఉందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు ఈ ఎస్ ఐ ఆర్‌కు వంత పడుతుండడం కేవలం వారి స్వలాభం కోసమేనని ధ్వజమెత్తారు. డీఎంకే మద్దతు ఓట్లన్నీ తొలగిన పక్షంలో వారికి అనుకూలంగా వాతావరణం మారుతుందని కలలు కంటున్నారని పేర్కొన్నారు. దరఖాస్తులు బీఎల్‌ఓలను సైతం గందరగోళానికి గురి చేసి ఉన్నాయని పేర్కొంటూ, ఇక డీఎంకే సభ్యులు రంగంలోకి దిగాలని వారితోపాటుగా ఇంటింటా తిరిగి ఓటును పరిరక్షించుకోవాలని పిలుపు నిచ్చారు. ఆగమేఘాలపై డిసెంబరు 4లోపు ప్రక్రియను ముగించి డిసెంబర్ 7 నాటికి అన్ని సిద్ధం చేసి జనవరి 1న మాదిర ఓటరు జాబితా ప్రకటించేందుకు ఉరకలు తీయడం వెనుక కుట్ర దాగి ఉన్నట్టు స్పష్టం అవుతోందన్నారు. నెల రోజులల ఈ ప్రక్రియను ఎలా పూర్తి చేయగలరని ప్రశ్నిస్తూ, దీనిని అడ్డుకునేందుకు అప్రమత్తంగా డీఎంకే శ్రేణులు వ్యవహరించాలని హెచ్చరించారు. అనేక చోట్ల బీఎల్‌ఓలు ఇంటింటా కూడా తిరగడం లేదని గుర్తు చేస్తూ, కార్యకర్తలు అప్రమత్తంగా లేకుంటే నష్టం తప్పదన్నారు.
హెల్ప్‌లైన్ నంబర్లు..
ఎన్నికల కమిషన్ కుట్రలను భగ్నం చేసే దిశగా ముందుకెళ్దామని పిలుపు నిస్తూ, జాబితా నుంచి ఏ ఒక్కరి ఓటూ గల్లంతు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేడర్‌పై ఉందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును పరిరక్షిద్దామని పేర్కొంటూ, డీఎంకే తరపున ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఎస్‌ఐఆర్ వ్యవహారంలో ఓటర్ల కోసం హెల్ప్‌లైన్ నంబరు 08065420020 ఏర్పాటు చేశామని ప్రకించారు. ఓటర్లే కాదు, డీఎంకే వర్గాలు ఈ నెంబర్‌కు ఫోన్‌చేసిన సందేశాలను నివృతి చేసుకోవాలని సూచించారు. అవసరమైన మార్గదర్శకాన్ని ఈ హెల్ప్‌లైన్ ద్వారా పొంద వచ్చని పేర్కొన్నారు. తమిళనాడు ప్రజల ఓటు హక్కులను కాపాడటానికి డీఎంకే ముందుంటుందని, నిలబడుతుందన్నారు. మన ఓటు హక్కును కాలరాసే ముప్పు మున్ముందు ఉందని పేర్కొంటూ, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, అప్రమత్తంగా వ్యవహరించి ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించుకుందామని పిలుపు నిచ్చారు.
రాష్ట్రానికి ఎస్‌ఐఆర్ ముప్పు!


