గ్రామసభలతోనే సమస్యలకు పరిష్కారం
వేలూరు: గ్రామసభలతోనే గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సుబ్బలక్ష్మి తెలిపారు. గ్రామ పంచాయతీల దినోత్సవాన్ని పురష్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లోనూ శనివారం ఉదయం గ్రామసభలు నిర్వహించారు. గ్రామ పంచాయతీలోని ఆదాయంఖర్చుల వివరాలను ప్రజలకు తెలియజేసి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వేలూరు జిల్లా గుడియాత్తం నియోజకవర్గం పరిధిలోని వలత్తూరు గ్రామ పంచాయతీలో కలెక్టర్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈసందర్భంగా పంచాయతీ పరిధిలోని వివిధ సమస్యలపై వచ్చిన వినతులను స్వీకరించి వాటిలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. ఆమె మాట్లాడుతూ గ్రామ పంచాయతీల దినోత్సవాన్ని పురష్కరించుకొని జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహించాలని ఆదేశించామన్నారు. సమస్యలను ఆయా సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు తెలియజేసి వాటిలో అర్హులైన వారికి పథకాలను అందజేస్తామన్నారు. గ్రామసభలో ఎమ్మెల్యే అములు, యూనియన్ చైర్మన్ నిత్యానందం, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా అనకట్టు నియోజకవర్గంలో గంగనల్లూరు గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహించి ప్రజలకు అన్నదానం చేశారు. అదేవిధంగా కాట్పాడి తాలుకా అమ్ముండి, పెరుముగై, వంటి పంచాయతీల్లో ఆయా సర్పంచ్‌ల అధ్యక్షతన ప్రజలతో గ్రామసభ నిర్వహించారు. వీటిలో ఎక్కువగా పింఛన్లకు సంబంధించి వినతులు రావడంతో వాటిని ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తామని తెలిపారు.


