నిర్మాత కథతో వచ్చారు!
తమిళసినిమా: అన్నా ప్రొడక్షన్స్ పతాకంపై అన్నాదురై నిర్మించిన చిత్రం మెడ్రాస్ మాఫియా కంపెనీ. ఏఎస్ .ముకుందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆనంద్‌రాజ్, బిగ్‌బాస్ సంయుక్త కలిసి నటించారు. నటులు ఆరాధ్య, దీప, షకీలా ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ దేవా సంగీతాన్ని అందించారు. శుక్రవారం సాయంత్రం చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించారు. దర్శకుడు ఆర్కే సెల్వమణి, ఆర్వీ ఉదయ్‌కుమార్, పేరరసు పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. అన్నాదురై మాట్లాడుతూ ఏడాదికి 240 చిత్రాలు విడుదలవుతున్నాయని, వాటిలో ఐదు శాతం మాత్రమే విజయం సాధిస్తున్నాయని అన్నారు.
అయినప్పటికీ ప్రతి ఏడాది నూతన నిర్మాతల సంఖ్య పెరుగుతూనే ఉందన్నారు. ఇందుకు కారణం సినిమాలపై మొహమేనని అన్నారు. పేపర్లో చదివిన ఒక సంఘటన నిజ జీవితంలో జరిగితే ఏమవుతుంది అనే ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం మెడ్రాస్ మాఫియా ఫ్యాక్టరీ అని చెప్పారు. దర్శకుడు ఏఎస్.ముకుందన్ మాట్లాడుతూ ఈ చిత్ర నిర్మాత అన్నాదురై ఒక న్యాయవాది అని చెప్పారు. అయినప్పటికీ ఆయన సినిమా ప్రేమికుడని ఈ చిత్రం ఇంత మంచిగా రావడానికి ఆయనే కారణమని అన్నారు. పారితోషకాలు బాకీ లేకుండా చెల్లించారని ఆయన డబ్బుతోనే కాకుండా కథతోనూ వచ్చారని చెప్పారు. ఈ కథలోని ప్రధాన పాత్రకు ఆనంద్‌రాజ్ కరెక్ట్‌గా ఉంటారని చెప్పడంతో వెంటనే ఆయనతో మాట్లాడి ఓకే చేసినట్లు చెప్పారు. అలాంటి మంచి మనసున్న నిర్మాత కోసమైనా ఈ చిత్రం విజయం సాధించాలని దర్శకుడు తెలిపారు.


