దర్శకత్వానికే ప్రాధాన్యం!
తమిళసినిమా: సీనియర్లో, జూనియర్లో, కొత్త దర్శకులైనాగానీ కంటెంట్ కొత్తగా ఉంటేనే చిత్రాలు సక్సెస్ సాధిస్తాయి. ఇందుకు ఉదాహరణ టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం. ఈ చిత్రం ద్వారా అభిషన్ జీవింత్ దర్శకుడుగా పరిచయమయ్యారు. అంతేకాకుండా కీలకపాత్రను పోషించారు. ఈయనకు ఎలాంటి దర్శకత్వం అనుభవం లేదన్నది గమనార్హం. అయినప్పటికీ టూరిస్ట్ ఫ్యామిలీ అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా అభిషన్ జీవింత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్ర షూటింగ్ కూడా పూర్తి అయింది. దీనికి ఆయన శిష్యుడు మదన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే దర్శక, నటుడు అభిషన్ జీవింత్ తాజాగా ఓ ఇంటివాడయ్యారు. తన పాఠశాల స్నేహితురాలు అఖిలని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం శుక్రవారం చైన్నెలో ఘనంగా జరిగింది. ఈసందర్భంగా శనివారం ఉదయం ఈ నూతన దంపతులు చైన్నెలో మీడియాను కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. అనంతరం అభిషన్ జీవింత్ మీడియాతో ముచ్చటిస్తూ తాను దర్శకత్వం వహించిన టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రాలు ఆదరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కథానాయకుడుగా నటిస్తున్న చిత్ర షూటింగ్ పూర్తి అయిందని త్వరలోనే దానికి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్లు చెప్పారు. అయితే తనకు తగిన కథ లభిస్తేనే నటిస్తానని, తాను దర్శకత్వానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. త్వరలోనే తాను దర్శకత్వం వహించే చిత్రానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తానని అభిషన్ జీవింత్ తెలిపారు.


