సినిమా నేపథ్యంలో తడై అదై ఉడై
తమిళసినిమా: యువతను అలరించే, ఆకట్టుకునే, ఉన్నత శిఖరాలకు చేర్చే మాద్యమాల్లో సినిమా ఒకటి. ఈ రంగంలో రాణించడం అంత సులభం కాదు. తగి న ప్రతిభ, కఠిన శ్రమ ఉన్నా కూడా అదృష్టం చాలా ముఖ్యం. అలా సినిమా రంగంలో తమ ప్రతిభను చాటుకోవడానికి ప్రయత్నించే యువకుల ఇతివృత్తంతో రూపొందిన చిత్రం తడై అదై ఉడై. ఇంతకుముందు సినిమా రంగంలో రాణించాలంటే చాలా శిక్షణ అవసరం అయ్యేది. అయితే సాంకేతిక పరిజ్ఞానం నానాటికీ అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో శిక్షణ కంటే ప్రతిభ, అదృష్టం అవసరం అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు యూట్యూబ్ చానళ్లు వంటి సామాజిక మాధ్యమాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాటి ద్వారా తమ ప్రతిభను నిరూపించుకోవాలని కొందరు యువకులు చేసే ప్రయత్నమే తడై అదై ఉడై. తమ ప్రయత్నంలో ఆ యువకులు ఎదుర్కొనే అవమానాలు, ఆటంకాలు, సమకాలీన రాజకీయాలు, విద్య ఆవశ్యకతను తెలిపే సన్నివేశాలు వంటి పలు ఆసక్తికరమైన ఆలోచింపజేసే అంశాలతో కూడిన చిత్రం ఇది. సినిమాను రూపొందించడానికి ఒక నిర్మాతను ఒప్పించే ప్రయత్నంలో ముగ్గురు యువకులు ఎలాంటి సమస్యలకు ఎదుర్కొన్నారు వంటి విషయాలను సహజత్వంగా చూపించిన చిత్రం ఇది. అయితే వారి ప్రయత్నం ఫలించిందా ? లేదా అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన తడై అదై ఉడై చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలను అరివళగన్ మురుగేశన్ మునిగేషన్ నిర్వహించారు. ఈ చిత్రానికి తంగ పాండియన్, చోటా మణికంఠన్ చాయాగ్రహణం, సాయ్‌సుందర్ సంగీతాన్ని అందించారు. కాగా ఈ చిత్రం శుక్రవారం తెర పైకి వచ్చింది.


