
కావేరిలో వరదలు
సాక్షి,చైన్నె : కావేరి నదిలో వరద ఉధృతి పెరిగింది. తీర వాసులను అలర్ట్ చేశారు. కృష్ణగిరి కే ఆర్‌పీ రిజర్వాయర్ నుంచి నీటి విడుదలతో తెన్‌పైన్నె నదిలోనూ వరద ఉధృతి పెరిగింది. పొన్నై నదిలోనూ వరదలు పోటెత్తుతుండటంతో తీర వాసులను అప్రమత్తం చేశారు. కర్ణాటకతో పాటూ కావేరి నదీపరివాహక ప్రదేశాలలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. గత నెలా మొదటి వారం వరకు కావేరి నీటి ఉధృతి పెరిగినా, ఆ తర్వాత క్రమంగా తగ్గింది. తాజాగా మళ్లీ ఉధృతి పరిగడంతో భారత నయాగారా హొగ్నెకల్‌లో సందర్శకులకు నిషేధం విధించారు. పడవ సావారి నిలుపుదల చేశారు. కావేరి నదీ తీరం వైపుగా ఎవ్వర్నీ వెళ్లనివ్వకుండా ఆయా మార్గాలనూ పోలీసులు మూసి వేశారు. తాజాగా సెకనుకు 65 వేల క్యూసెక్కుల మేరకు నీరుప్రవహిస్తున్నా, క్రమంగా ఈ శాతం పెరగవచ్చు అనే సమాచారంతో కావేరి తీర వాసులను అలర్ట్ చేశారు. ఈ నీరు మేట్టూరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది. మేట్టూరు జలాశయం నీటిమట్టం 112 అడుగులుగా ఉంది. 119 అడుగులకు చేరగానే 16 గేట్లను మళ్లీ ఎత్తి వేసి ఉబరి నీటిని విడుదల చేయడానికి తగ్గ కార్యాచరణతో అధికారులు ఉన్నారు. అదే సమయంలో కృష్ణగిరిలోని కేఆర్‌పీజలాశయం నిండింది. ఇందులో నుంచి సెకనుకు ఏడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, విల్లుపురం, కడలూరు జిల్లాలోని తెన్ పైన్నె నదీ తీర వాసులకు అలర్ట్ ప్రకటించారు. అలాగే,పొన్నై నదిలోనూ నీటి ఉధృతి పెరిగింది. దీంతో అధికారులుముందస్తు ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. నదీ తీరాలలోకి ఎవ్వరూ వెళ్ల వద్దని హెచ్చరిస్తూ దండోరా వేయిస్తున్నారు. గత ఏడాది తెన్ పైన్నె నది మూడు జిల్లాలో వరద విలయాన్ని సృష్టించిన నేపథ్యంలో ఈ సారి అధికారులు అప్రమతమై శిబిరాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంత వాసులను అప్రమత్తం చేస్తూ, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా ఈశాన్య రుతు పవనాలు మరి కొద్దిరోజులల ప్రవేశించనున్న నేపథ్యంలో రాష్ట్రంలో విస్తారంగా పలు జిల్లాలో వర్షాలుపడుతున్నాయి. శనివారం తిరుప్పూర్, తేని, అరియలూరు జిల్లాలో కుండ పోతగా వర్షం పడింది. చైన్నె, శివారులలో వాతావరణం పూర్తిగా మారింది. అదే సమయంలో సీజన్ జ్వరాల సంఖ్య పెరుగుతున్నది. చైన్నె, కోయంబత్తూరులలో అయితే, డెంగీ కేసుల నమోదు పెరుగుతుండటం గమనార్హం.